11-10-2025 10:29:06 PM
100 గ్రాముల గంజాయి స్వాధీనం..
మందమర్రి (విజయక్రాంతి): నిషేధిత మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని పట్టణ ఎస్సై ఎస్ రాజశేఖర్ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముగ్గురు యువకులు కాగజ్ నగర్ నుండి గంజాయిని అక్రమంగా తీసుకువస్తున్నారని అందిన సమాచారం మేరకు, తమ సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించగా హోండా డియో స్కూటీపై ముగ్గురు వ్యక్తులు వస్తుండగా అనుమానం వచ్చి వాహనాన్ని తనిఖీ చేయగా 100 గ్రాముల ఎండు గంజాయి లభించిందని, గంజాయిని స్వాధీనం చేసుకుని గంజాయిని తరలిస్తున్న మండలంలోని పొన్నారం గ్రామానికి చెందిన ఏల్పుల వర్శిత్, అదిలపేటకు చెందిన వేల్పుల రాహుల్, నస్పూర్ కు చెందిన ఐత మనిదీప్ లను అరెస్ట్ చేశామని తెలిపారు.
నిందితులు కాగజ్ నగర్ కి చెందిన వ్యక్తి నుండి గంజాయిని కొనుగోలు చేసి, ఈ ప్రాంతంలో అమ్మడానికి, వారి వ్యక్తిగత వినియోగానికి తీసుకొస్తుండగా పట్టుకున్నామన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు ఈ నేరాలకు పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నారని వివరించారు. కాగా గంజాయి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పట్టణ ఎస్ఐ రాజశేఖర్, హెడ్ కానిస్టేబుళ్లు రాము, రాజేశ్వరరావు, సయ్యద్ మహమ్మద్ లను బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అభినందించారు.