calender_icon.png 30 August, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలానికి స్వల్ప వరద

30-08-2025 01:33:51 AM

-9 గేట్ల ద్వారా నీటి విడుదల

-పరవళ్లు తొక్కుతున్న సాగర్, 26 గేట్లు ఎత్తివేత

నాగర్‌కర్నూల్/నాగార్జునసాగర్,  ఆగస్టు 29 (విజయక్రాంతి): ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలానికి వరద తీవ్రత పెరుగుతోంది. గత ఐదు రోజులుగా ఎగువ నుంచి వరద తీవ్రత క్రమంగా తగ్గుతూ రావడంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తారు. మళ్లీ వరద తీవ్రత పెరుగుతుండటంతో శుక్రవారం 9 గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తారు. 882 అడుగుల (202 టీఎంసీలు) సామర్థ్యమున్న శ్రీశైలం బరాజ్‌లో ప్రస్తుతం 881.60 అడుగుల (197.0114 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి కోసం 65,541 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.

సాగర్ వద్ద పర్యటకుల సందడి..

ఎగువ నుంచి కృష్ణమ్మ ఉరకలెత్తడంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. వరద ప్రవాహం భారీగా ఉండటంతో శుక్రవారం 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 2,50,432 క్యూసెక్కుల భారీ వరద వచ్చి చేరుతుంది. అధికారులు డ్యామ్ గేట్లను ఎత్తడం ద్వారా 2,01,058 క్యూసెక్కులను స్పిల్ వే మీదుగా దిగువకు వదులుతున్నారు.

సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 586 అడుగులు (302.9125 టీఎంసీల) నీటి మట్టానికి చేరుకుంది. దీంతో సాగర్ జలాశయం నుంచి ఎడమకాల్వకు 4,160 క్యూసెక్కులు, కుడి కాల్వకు 9019 క్యూసెక్కులు, హైదరాబాద్ జంట నగరాల తాగు నీటి అవసరాలకు ఏఎమ్మార్పీకి 2400 క్యూసెక్కులు, వరద కాల్వకు 300 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,495 క్యూసెక్కులు, అవుట్ ఫ్లోగా 2,50,432 క్యూసెక్కులను దిగువకు పంపుతున్నారు.