30-08-2025 01:05:14 AM
వరంగల్ (మహబూబాబాద్) ఆగస్టు 29 (విజయక్రాంతి)/ ఖమ్మం /హుజూరాబాద్: వరంగల్ జిల్లా ఫోర్ట్ వరంగల్ తహ సీల్దార్‌పై ఆదాయానికి మించి అక్రమాస్తులపై వచ్చిన ఆరోపణలపై శుక్రవారం వరంగల్‌లోని తహసీల్దార్ నివాసంతో పాటు ఖమ్మం జిల్లాలోని ఆయన స్వస్థలంలోనూ ఏసీబీ అధికారులు దాడులు నిర్వ హించారు. ఒకటి కాదు రెండు కాదు.. కొన్ని కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకా రం.. వరంగల్ జిల్లా పరిధిలోని ఫోర్ట్ వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు.
దాడుల్లో రూ. 1.15 కోట్ల విలువైన ఏడు స్థిరాస్తుల పత్రాలు, రూ.1.42 లక్షల విలువైన 17 ఎకరాల భూమి, 10 గుంటల వ్యవసాయ భూమి, రూ. 23.84 లక్షల విలువైన 70 తులాల బంగారు ఆభరణాలు, రూ.92,000 విలువైన వెండి వస్తువులు, రూ.34.78 లక్షల విలువైన రెండు ఫోర్-వీలర్లు, ఒక టూ-వీలర్, రూ.3.28 లక్షల విలువైన 23 గడియారాలు, రూ. 16.43 లక్షల విలువైన ఇతర గృహోపకరణాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
వీటన్నింటి విలువ సుమారు రూ.5.02 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం సదరు తహసీల్దార్‌ను స్పెషల్ జడ్జి ముందు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
స్వగ్రామంలో 10 గంటల పాటు సోదాలు..
ఫోర్ట్ వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు స్వస్థలమైన ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిరుమలాపురంలోనూ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ రమేశ్ నేతృత్వంలో 12 మంది సిబ్బంది ముందుగా తిరుమలాపురం గ్రామంలోని తహసీల్దార్ సోదరుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతరం అనంతసాగర్‌లోని మరో సోదరుడికి చెందిన కోళ్ల ఫారంలోనూ దాడులు నిర్వహించారు.
సోదాల్లో 5.5 ఎకరాల భూమికి సంబంధించిన డాకుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఏసీబీ అధికారులు రెండుచోట్ల కలిపి సుమారు 10 గంటల పాటు సోదాలు చేయడం మండలంలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయవచ్చని ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని, అవినీతి అధికారుల వివరాలను ధైర్యంగా చెప్పవచ్చని తెలిపారు. ప్రజలు అవసరమైతే 94404 46106 అనే నంబర్‌కు వాట్సాప్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
కరీంనగర్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శి లంచావతారం..
కొత్తగా నిర్మించిన గృహానికి ఇంటి నంబర్ ఇచ్చేందుకు పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి పంచాయతీ కార్యదర్శి సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన ఓ వ్యక్తి కొత్తగా నిర్మించుకున్న ఇంటికి నంబర్ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజును కోరాడు.
పంచాయతీ కార్యదర్శి అందుకు రూ.20 వేల లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు శుక్రవారం పంచాయతీ కార్యదర్శికి రూ.20 వేలు ఇస్తుండగా, అప్పటికే కాపుగాసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచారు. పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కడంతో కొందరు గ్రామస్తులు గ్రామంలో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.