30-08-2025 02:20:00 AM
-బీసీ కోటాపై సర్కార్ కాలయాపన
-‘కూటమి’ ఎంపీలు ఒక్కసారైనా పార్లమెంట్‌లో ప్రస్తావించారా?
-జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 29 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కోటాపై కావాలనే కాలయాపన చేస్తూ, డైవర్షన్ రాజకీ యాలకు పాల్పడుతున్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ స భ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఢిల్లీలో ధర్నాలు, నిరంతర సమావేశాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
హైదరాబాద్‌లోని సచివాలయం ఎదుట ఉన్న మీడియా పాయింట్‌లో ఆయ న మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి బిల్లును ప్రవేశపెట్టి బీసీ కోటా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై దుష్ర్పచారం మానేయాలని హితవు పలికారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, గవర్నర్ బిల్లుపై సంతకం చేయని పక్షంలో సుప్రీంకోర్టులో మాండమస్ పిటిషన్ దాఖలు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సర్కార్ అలా చేయకుండా బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి కాలయాపన చేస్తుందని దుయ్యబట్టారు. రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉందని కృష్ణయ్య స్పష్టం చేశారు.
రిజర్వేషన్ల పెంపునకు అవసరమైన కులాల వారీగా జనాభా లెక్కలు (ఎంపరికల్ డేటా) ప్రభుత్వం వద్ద ఉన్నాయని, అసెంబ్లీలో చట్టం చేసి జీవో జారీ చేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు సైతం ఇలాంటి కేసుల్లో 50శాతం సీలింగ్‌ను ఎత్తివేసిందని గుర్తుచేశారు. ఇందిరా సహానీ కేసులో కూడా ఎంపరికల్ డేటా ఉంటే 50శాతం పరిధిని అధిగమించవచ్చని అభిప్రాయపడిందని గుర్తుచేశారు.
చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి అవరోధాలు లేనప్పటికీ, ప్రభుత్వం కోర్టుల్లో కేసు ఓడిపో తుందని ఊహాగానాలతో వెనుకడుగు వేయడం సరికాదని తెలిపారు. ఓట్ చోరీ అంశంపై నెలరోజుల పాటు పార్లమెంట్‌ను స్తంభింపజేసిన 250 మందిపైగా ఇండియా కూటమి ఎంపీలు.. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఒక్కరోజైనా పార్లమెంట్‌లో చర్చించకపోవడం సిగ్గుచేటన్నారు. పార్టీల పరంగా కోటా ఇచ్చి, సమస్యను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. సర్కార్ ఇప్పటికైనా ప్రభుత్వం నాటకాలు ఆపి, అసెంబ్లీ సమావేశాల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు.