calender_icon.png 30 August, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద గోదావరి

30-08-2025 01:09:25 AM

  1. బాసర వద్ద ప్రమాదకరంగా గోదావరి ప్రవాహం
  2. పుష్కర ఘాట్లపైకి పోటెత్తిన వరద 
  3. అమ్మవారి ఆలయం వరకు నీరు
  4. కాటేజీల వరకు చేరిన వరద
  5. లోతట్టు ప్రాంతాలు జలమయం
  6. నిర్మల్ జిల్లాలో భయంభయం
  7. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
  8. భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన నీటిమట్టం 
  9. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
  10.   2,20,443 ఎకరాల్లో పంట నష్టం
  11. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా

నిర్మల్/జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్)/భద్రాచలం, ఆగస్టు 29 (విజయక్రాంతి): మహారాష్ట్రతో పాటు ఉత్తరాది జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చిం ది. నదిలో ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. నిర్మల్ జిల్లాలో బాసరలో పరిస్థితి తీవ్రంగా ఉంది. శుక్రవారం ఉదయం బాసరలో నది రెండు గట్లను దాటి కిలోమీటర్ పొడవున వరద నీరు నిలిచింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

బాసర బ్రిడ్జితో పాటు రైల్వే బ్రిడ్జీని ఆనుకొని గోదావరి ప్రవహించింది. దీంతో రైల్వే రాకపోకలను నిలిపివేశారు. బాసరలోని పుష్కర ఘాట్లు, రోడ్లపైకి వరద నీరు చేరడంతో కాటేజ్‌ల వరకు వరద నీరు వచ్చింది. స్థానిక సరస్వతీ నగర్ కాలనీతో పాటు, వివిధ కాలనీలు జలమయమయ్యాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాసర, లోకేశ్వరం, దిల్వాపూర్, నర్సాపూర్, కుంటల తదితర మండలాల్లో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌తో మూడు వేల ఎకరాల్లో మొక్కజొన్న, సోయా, వరి, పత్తి తదితర పంటలు నీట మునిగాయి.

గోదావరి నీరు తమ పంటలను ముంచెత్తడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బాసర చరిత్రలో 1983 తర్వాత దాదాపు 42 ఏండ్ల అనంతరం ఈ స్థాయిలో వరదలు ముంచెత్తాయి. ఎస్సారెస్పీ వద్ద 49 గేట్లను ఎత్తి 5.71 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బాసర వద్ద గోదావరిలో సుమారు 4.70 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతుంది. సోన్ మండలంలోని పాక్ పట్ల, మాదాపూర్ సొన్, కూచంపల్లి, లక్మచంద్ర మండలంలోని తిరుపల్లి, మునిపల్లి, పారుపల్లి, మామడ మండలంలోని కోమల్‌కోట్, పోతారం తదితర గ్రామాల్లో ఆనుకుని ఎస్సారెస్పీ వరద నీరు ఉప్పొంగింది.

దీంతో నిర్మల్ జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు భయంభయంగా గడిపారు. ఈ గ్రామాల్లో సుమారు రెండువేల ఎకరాల వరకు వివిధ పంటలు వరద నీరు నిలిచిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మాదాపూర్ గ్రామం వద్ద స్వర్ణ నది నీళ్లు నిలిచిపోవడంతో రాకపోకలను నిలిపేశారు.

మాదాపూర్ వద్ద ఉన్న మొసళ్ల సంరక్షణ కేంద్రం, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామూహిక ప్రకృతి వనం వరద నీటితో మునిగిపోయింది. సోన్ పాత బ్రిడ్జిని ఆనుకొని నీరు ప్రవహిస్తోంది. జిల్లావ్యాప్తంగా 200 ఎకరాల్లో పామాయిల్ తోటలు దెబ్బతిన్నాయి. గోదావరి పరివక ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల పర్యటించి లోతట్టు ప్రాంతాల ప్రజలను ట్రాక్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

కాళేశ్వరం వద్ద ఉధృతి..

కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉదయం 12.50 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహించడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మహదేవపూర్ మండలంలో గోదావరి నది మహోగ్రరూపంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లను ఎత్తి గోదావరిలో నీటిని విడుదల చేస్తున్నారు.

కాళేశ్వరంలోని సరస్వతీ ఘాట్ వద్ద జ్ఞాన దీపాలు మునిగి సరస్వతీ విగ్రహం వరకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి రాగా మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ పుణే బృందం ఎలక్ట్రిక్ బోట్లతో గోదావరిలో తిరుగుతూ నీటి ప్రవాహాన్ని తెలుసుకుంది.

భద్రాచలంలో 43 అడుగుల వద్ద గోదావరి..

భద్రాచలం వద్ద దక్షిణ గంగ విశ్వరూపం ప్రదర్శించింది. ఉదయం నుంచే వరద ఉధృతి పెరిగింది. సాయంత్రం 7 గంటల 22 నిమిషాలకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ఇలాగే కొనసాగితే శనివారం నాటికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గోదావరి ఎగువన ఉన్న పేరూరు వద్ద సాయంత్రం 16.650 మీటర్ల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తున్నందున.. ఆ నీరు భద్రాచలానికి రాగానే 48 అడుగులు దాటుతుందని అధికారలు అంచనా వేస్తున్నారు.

దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై వరద సహాయక సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇప్పటికే లాంఛీలను సిద్ధం చేయడంతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను భద్రాచాలానికి రప్పించారు. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగుల వద్ద ప్రవహించడంతో స్నాన ఘట్టాలు పూర్తిగా నీటమునిగాయి. దీంతో భక్తులు స్నానాలు చేయకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం నుంచి చర్ల వెళ్లే రహదారిపై గోదావరి వరద చేరింది.