30-08-2025 01:23:37 AM
ఒంటి గంటకు క్యాబినెట్ సమావేశం
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాష్ట్ర శాసనసభ, శాసన మండ లి సమావేశాలు శనివారం ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, చర్చలు జరిగే అవకాశం ఉంది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో మొదటిరోజు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మా గంటి గోపీనాథ్ మృతిపట్ల సభ సంతా పం ప్రకటించనుంది. మాజీ ఎమ్మెల్సీలు మాగం రంగారెడ్డి, డాక్టర్ టీ రత్నాకర్ మృతి పట్ల మండలి సంతాపాన్ని ప్రకటించనుంది. సంతాప తీర్మానాలు, సభ్యుల సంతాపాల తరువాత ఉభయసభలు వాయిదా పడనున్నాయి.
బీఏసీ సమావేశంలో నిర్ణయం..
సభలు వాయిదా పడిన తరువాత స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిల సారథ్యం లో బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ తరఫున ప్రతినిధులు పాల్గొంటారు. వీరందరితో చర్చించిన తర్వాత సభలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలనేది స్పీకర్, మండలి చైర్మన్లు నిర్ణయిస్తారు.
సుమారు మూడు, నాల్గు రోజులపాటు సభలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టడం, 42% బీసీ రిజర్వేషన్లపై చర్చించాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా సమాచారం.
డిప్యూటీ స్పీకర్ ఎన్నిక!
బీఏసీలో నిర్ణయం తీసుకునే దానినిబట్టి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండనుంది. అయితే ఆదివారం సభా సమావేశాలు లేకపోతే.. రెండోరోజు (సోమవారం) డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉండనుంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ముగిసిన తరువాత.. ప్రభుత్వం కాళేశ్వరంపై కమిషన్ ఇచ్చిన నివేదికను సభలో ప్రవేశపెట్టనుంది.
క్యాబినెట్ సమావేశం..
శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు అసెంబ్లీ కమిటీ హాలులోనే క్యాబినెట్ సమావేశం కానుంది. ఇందులో ప్రధానంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం ఉది. చట్టబద్దంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ముందుకు వెళ్లాలా.. లేక పార్టీపరంగా బీసీ రిజర్వేషన్లు ప్రకటించి.. అందుకనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముం దుకు వెళ్లాలా అనేది నిర్ణయిస్తారు. దీని ప్రకారం స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఆఖరు నాటికి స్థానిక ఎన్నికలను నిర్వహించేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకోనున్నది. దీనితోపాటు కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక, దానిని అధ్యయనం చేసి ఇచ్చిన త్రిసభ్య కమిటీ నివేదికలపై లోతుగా చర్చించే అవకాశం ఉంది.
శాసనసభలో కమిషన్ నివేదికను ప్రవేశపెట్టడం, దానిపై చర్చించడం, ప్రాజెక్టు నిర్మా ణంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సిఫా రసుల ప్రకారం బాధ్యులపై ఎలాంటి చర్య లు తీసుకోవాలనేదానిపై క్యాబినెట్ సమావేశంలో ఒక స్పష్టత రానుంది. దీని ప్రకారం అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనున్నది. తద్వారా బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగేందుకు సమాయాత్తమయ్యింది.
కాళేశ్వరంపై బీఆర్‌ఎస్ ప్రిపరేషన్..
పీసీ ఘోష్ కమిషన్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సభకు మాజీ సీఎం కేసీఆర్ వస్తారా లేదా అనేది అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే సమావేశాల నేపథ్యంలో శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో కేసీఆర్‌తో హరీశ్‌రావు భేటీ అయ్యారు. సభలో వ్యవహరించాల్సిన తీరుపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
పైగా కాళేశ్వరంపై చర్చలో ఏయే అంశాలు చర్చించాలి.. టెక్నికల్‌గా ఏయే అంశాలపై లోతుగా వెళ్లవచ్చు, అధికారపక్షాన్ని ఎలా ముప్పు తిప్పలు పెట్టవచ్చనే కోణంలో చర్చ జరినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్‌తో భేటీ తరువాత.. హరీశ్‌రావు పార్టీ నేతలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అయి సభలో వ్యవహరించాల్సిన, చర్చించాల్సిన అంశాలను విశదీకరించినట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా.. పీసీ ఘోష్ కమిషన్ 665 పేజీలతో నివేదిక ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఈ 60 పేజీల నివేదికనే బయట పెట్టింది. క్యాబినెట్ భేటీలో మొత్తం కమిషన్ నివేదికను సభ ముందు ఉంచాలా.. లేక త్రిసభ్య కమిటీ ఇచ్చిన 60 పేజీల నివేదికనే అధికారికంగా ప్రవేశపెట్టి.. దానిపైనే చర్చించాలా అనేదానిపై నిర్ణయం తీసుకోను న్నారు.
ఈ నేపథ్యంలోనే 665 పేజీల కమిషన్ పూర్తి నివేదికనే సభ ముందు ఉంచాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేయనుంది. కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలు, సభా వ్యవహారాల నిర్వహణపై బీఏసీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఏ నివేదికలను సభ ముందు ఉంచుతారనేది తేలనుంది.