30-08-2025 12:55:18 AM
-కమీషన్ కోసం ఎదురుచూపులు
-ఐదు నెలలుగా అందని కమీషన్
-రూ.5 కోట్లకు పైగా బకాయిలు
-డీలర్లకిచ్చిన హామీల అమలెప్పుడు..?
నల్లగొండ టౌన్, ఆగస్టు 29: పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేసి వారి ఆకలి తీర్చుతున్న రేషన్ డీలర్లు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి రావాల్సిన కమీషన్ రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం డీలర్లకు 5 నెలల కమీషన్ పెండింగ్లో ఉన్నది. ఏప్రిల్ నుంచి కమీషన్ రావాల్సి ఉన్నదని డీలర్లు చెప్తున్నారు. జూన్లో ఒకేసారి జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల బకాయిలకు తోడుగా మరో మూడు నెలల బకాయిలు చేరాయి. ఇలా మొత్తం ఐదు నెలల బకాయిలు పేరుకుపోయాయి.
రూ.దాదాపు 5 కోట్లకు బకాయిలు..
జిల్లాలో పాత లెక్కల ప్రకారం 4,66,061 రేషన్కార్డుదారులుండగా వీరికి ప్రతి నెల 8,877 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుండగా మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ అవుతున్నది. ఇందుకు సంబంధించి డీలర్లకు ప్రతి క్వింటాలుకు ప్రభుత్వం రూ. 140 చొప్పున కమీషన్ చెల్లిస్తున్నది. ఈ నేపథ్యంలో 8,877 మెట్రికు టన్నులకు గానూ ప్రతి నెల సమారు రూ. ఒక్క కోటి వరకు కమీషన్ చెల్లించాల్సి ఉన్నది.
ఈ లెక్కన ఐదు నెలలకు రూ.5) కోట్ల వరకు బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత నెల ఒకేసారి మూడు నెలల బియ్యం సరఫరా చేయాల్సి రావడంతో హమాలీ, లేబర్, ఇతర ఖర్చులు మూడింతలయ్యాయి. ఈ మొత్తం ఖర్చు బయట నుంచి అప్పోసప్పో చేసి సొంతంగా పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం నుంచి వాటిని సర్దుబాటు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి తమ బకాయిలు తొందరగా విడుదలయ్యేలా చూడాలని కోరుతున్నారు.
డీలర్లకిచ్చిన హామీల అమలెప్పుడు..?
ఎన్నికల్లో రేషన్ డీలర్లను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ వారిపై హామీల వర్షం కురిపించింది. క్వింటాలుపై కమీషన్ను రూ. 140 నుంచి 300కు పెంచుతామని హామీ ఇచ్చింది. దీంతో పాటు ప్రతి రేషన్ డీలర్కు ప్రతి నెల రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలపై కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీనిపై రేషన్ డీలర్లు తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నదంటూ మండిపడుతున్నారు. అయితే గతంలో రేషన్డీలర్ల కష్టాలు తెలిసిన బీఆర్‌ఎస్ సర్కారు వారి కమీషన్ రూ. 70 నుంచి రూ. 140కి పెంచింది.
రేషన్ షాపుల బందు ప్రకటిస్తాం :
తాము ఎంతో కష్టపడి మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేశాం. తాము చేసిన కష్టానికి ప్రతిఫలం కావాలని అడుగుతున్నాము.జిల్లాలో ఇప్పటివరకు 5 నెలల సొమ్ము సుమారుగా రూ.5 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టినటువంటి గౌరవవేతనం, కమిషన్ పెంపు వంటి అంశాలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. తమ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో తాము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపుల బందు ప్రకటిస్తాం.
- వైద్యుల సత్యనారాయణ, రేషన్ డీలర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి