calender_icon.png 13 November, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

13-11-2025 07:20:26 PM

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం

ప్రజల దాహార్తి తీర్చిన తర్వాతే పరిశ్రమలకు నీటి సరఫరా

మూడు నెలలకు ఒకసారి సైతం మంచినీరు రావడం లేదు

అధికారులు తీరు మార్చుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు

గ్రామీణ నీటిపారుదల అధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు: మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి రోజు స్వచ్ఛ జలాలు అందించాల్సిన గ్రామీణ నీటిపారుదల విభాగం అధికారులు నీటి పంపిణీ అంశంలో ఘోరంగా విఫలం అవుతున్నారని.. ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీల పరిధిలోని గ్రామాలకు మూడు నెలలకు ఒకసారి మంచినీరు సరఫరా అవుతున్నాయని.. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్ డబ్ల్యూ ఎస్) అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం, లకడారం, ఇస్నాపూర్, పాశమైలారం, క్యాసారం, చిట్కుల్, తెల్లాపూర్ పరిధిలోని పోచారం, ఇంద్రేశం పరిధిలోని బచ్చుగూడ, ఇంద్రేశం, రామేశ్వరం బండ, పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, ఐనోలు, అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని సుల్తాన్పూర్, వడకపల్లి, దాయర తదితర గ్రామాలకు గత రెండు సంవత్సరాలుగా మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు సక్రమంగా మంచినీరు పంపిణీ కావడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి జీవనానికి అత్యంత కీలకమైన తాగునీటిని అందించడంలో విఫలమైతే ప్రజలు నమ్ముకుని ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వానికి  చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. సింగూరు, కాలేశ్వరం రిజర్వాయర్లలో మంచినీటి నిల్వలు సరిపడా ఉన్నప్పటికీ పంపిణీ అంశంలో ఎందుకు విఫలమైతున్నారని అధికారులను ప్రశ్నించారు.

ఇదే అంశంపై గతంలోనూ సమీక్ష సమావేశాలు నిర్వహించిన మార్పు రాకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పలు గ్రామాలకు మూడు నెలలకు ఒకసారి మంచి నీరు విడుదల అవుతున్నాయని.. ప్రజలు ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు. పాశమైలారం పారిశ్రామిక వాడకు మాత్రం నిరాటంకంగా మంచినీరు సరఫరా అవుతున్నాయని. ప్రజలకు వచ్చేసరికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమకు నీళ్లు అందించడానికి తాము వ్యతిరేకించడం లేదని... ప్రథమ ప్రాధాన్యతగా ప్రజలకు అందించిన తర్వాతనే మిగతా విభాగాలకు అందించాలని ఆయన అధికారులకు సూచించారు. మంచినీటి పంపిణీ అంశంపై నిత్యం గ్రామీణ ప్రాంతాలు, కాలనీల ప్రజల నుండి వందలాది ఫిర్యాదులు తమకు అందుతున్నాయని.. ఇదే పరిస్థితులు కొనసాగితే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఖాళీ బిందెలతో రహదారుల ఇబ్బందించే పరిస్థితులు తలెత్తకుండా తక్షణమే పంపిణీ అంశంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. నిధుల అంశంలో ఇబ్బందులు తలెత్తితే తనను నేరుగా సంప్రదించాలని. ప్రభుత్వంతోపాటు సిఎస్ఆర్ నిధులు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే జిఎంఆర్ అధికారులకు సూచించారు. రాబోయే వారం రోజులలో పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి.. ప్రతి గ్రామానికి నిర్దేశించిన విధంగా మంచి నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ రఘువీర్, ఈఈ విజయ లక్ష్మి, డీఈలు  హరీష్, శ్రీనివాస్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.