05-12-2025 07:05:51 PM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కాలనీల అభివృద్దే ప్రధాన లక్ష్యమని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ జంట సర్కిల్ అయిన కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిల్ మున్సిపల్ కార్యాలయాలలో నూతనంగా చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గాజులరామారం సర్కిల్ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.10 కోట్లు మంజూరు కాగా, కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని పలు కాలనీలలో రూ.3.50 కోట్లు మంజూరవగా, జంట మున్సిపల్ సర్కిల్లో పరిధిలోని పలు కాలనీలలో చేపట్టవలసిన రోడ్డు నిర్మాణ పనులు, స్మశాన వాటికల అభివృద్ధి పనులు, పార్కుల అభివృద్ధిపై ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... మంజూరైన నిధులతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు, స్మశానవాటికల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి వంటి పనులలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా త్వరితగతిన పనులను చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో గాజులరామారం ఉప కమిషనర్ మల్లారెడ్డి, మాజీ కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం ఈఈ, డీఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు.