18-09-2025 08:51:15 PM
పట్టణ నిధులు వేరే మండలానికి మళ్ళింపు..
మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి..
రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): భూపాలపల్లి పట్టణ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం ఆయన భూపాలపల్లి బస్టాండ్ సెంటర్ లో బీఆర్ఎస్ కార్యకర్తలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణ ప్రజలు స్థానిక ఎమ్మెల్యేని ఓట్లేసి గెలిపిస్తే భూపాలపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసేది పోయి అధికార అహంకారంతో నిధుల మళ్లింపు చేస్తున్నాడని విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణ అభివృద్ధికి అంబేద్కర్ చౌరస్తా నుండి టు ఇంక్లైన్, ఓపెన్ కాస్ట్ వరకు టియు ఎఫ్ఐడిసి నిధుల నుండి రూ.6 కోట్లు, సిఎస్ఆర్ నిధుల నుండి రూ.4 కోట్లతో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు మంజూరు చేసి, మేము శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించమన్నారు. కానీ నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే సిఎస్ఆర్ నిధుల నుండి రూ.4 కోట్లను వేరే మండలానికి తరలించి పనులు జరుగుతున్న వాటిని ఆపివేసి భూపాలపల్లి పట్టణ అభివృద్ధికి అడ్డుగా మారుతున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే, అధికారుల నిర్లక్ష్య ధోరణి ఎండగడుతూ ప్రజలకు తెలిసేలా నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్టు బిఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.