calender_icon.png 19 September, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాంపు కార్యాలయంలో ప్రోటోకాల్ పాటించాలి

18-09-2025 10:08:21 PM

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్

సూర్యాపేట (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రోటోకాల్ పాటిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలను తప్పనిసరిగా ఉంచాలని సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలి, మాజి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిసిసి ప్రధాన కార్యదర్శి పోలగాని బాలు గౌడ్, ఐ ఎన్ టియుసి పట్టణ అధ్యక్షులు రెబల్ శ్రీను తో కలిసి మాట్లాడారు. క్యాంపు కార్యాలయం అనేది ప్రభుత్వం ఎమ్మెల్యేల కోసం కట్టించిందని అది మాజీ మంత్రి శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రైవేట్ ఆస్తి కాదన్నారు.

కావున క్యాంపు కార్యాలయంలో తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలన్నారు. సీఎం, మంత్రి చిత్రపటాలు క్యాంప్ కార్యాలయంలో లేవని ప్రజల నుండి ఫిర్యాదు రావడంతో బుధవారం మీడియా సమక్షంలో క్యాంప్ కార్యాలయానికి  వెళ్లి సీఎం, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలు అమర్చామన్నారు. వాటిని  తొలగించినట్లయితే తిరిగి  పెడతామన్నారు. సూర్యాపేటలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే ఫోటో ఫ్లెక్సీలలో ఏర్పాటు చేస్తున్నారని విషయం మర్చిపోవద్దన్నారు. ప్రైవేటు ఆస్తులు అంటే నాగారంలో, హైదరాబాదులో కట్టుకున్న విల్లాలు, శంషాబాద్ లో, కర్ణాటకలో కొన్న భూములు అనే విషయాన్ని మరవొద్దు అన్నారు. కానీ సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయం మాత్రం ప్రభుత్వ భవనమని,  ఎమ్మెల్యేగా ఎవరు  గెలిస్తే వారికి ఆ భవనం కేటాయించడం జరుగుతుందన్నారు. మీడియా సమక్షంలో వెళ్లి ఫోటోలు ఏర్పాటు చేస్తే అక్కడ గందరగోళం చేశారంటూ టిఆర్ఎస్ నాయకులు చెప్పడం వారి నిజాయితీకి నిదర్శనం అన్నారు. ఎవరు ఎలాంటి వారు అనేది ప్రజలందరికీ తెలుసునని, ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు. ఈ సమావేశంలో  నాయకులు రుద్రంగి రవి, నాగుల వాసు,  ఆలేటి మాణిక్యం, గడ్డం వెంకన్న, సిరివెళ్ల శభరి, గండూరి రమేష్, కోల నాగరాజు, బొజ్జ సంజయ్, సిద్దిక్, సృజన్ తదితరులు పాల్గొన్నారు.