18-09-2025 10:32:04 PM
అంకిత్ కొయ్య, నీలఖి, వీకే నరేశ్, వాసుకి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్యూటీ’. ఏ మారుతి టీమ్ ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై విజయ్‌పాల్‌రెడ్డి అడిదల, ఉమేశ్‌కుమూర్ భన్సల్ నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేని ఆర్‌వీ సుబ్రహ్మణ్యం అందించగా.. జేఎస్‌ఎస్ వర్ధన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో అంకిత్ కొయ్య మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
‘బ్యూటీ’ కథలోకి ఎలా వచ్చారు..? కథ విన్నాక ఏమనిపించింది?
‘బ్యూటీ’ అనే టైటిల్‌ను, లోగోను అంతా కూడా మారుతి డిజైన్ చేశారు. ఈ టైటిల్ పెట్టిన తర్వాత, అంతా ఫిక్స్ అయిన తర్వాతే నేను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ‘బ్యూటీ’ కథ విన్న తర్వాత నేను షాక్ అయ్యాను. నాకు కథ చాలా బాగా నచ్చింది. కాకపోతే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాను.
ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
ఇంతవరకు నన్ను ఎప్పుడూ చూడని పాత్రలో ప్రేక్షకులు చూస్తారు. అర్జున్ పాత్రలో నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మొదట్లో భయపడ్డాను. అయితే, ఓ నటుడిగా పాత్రకు న్యాయం చేయాలన్నదే నేను మైండ్‌లో పెట్టుకున్నాను. పాత్రకు కావాల్సినట్టు నటించాను.
ఈ చిత్రంలో అసలైన బ్యూటీ ఏంటి..? ఎవరు?
‘బ్యూటీ’ చిత్రానికి నరేశ్ వీకే హీరో. ఆయన పాత్ర నాకు చాలా ఇష్టం. కథ విన్నప్పుడే ఆ పాత్రకు ఎక్కువగా కనెక్ట్ అయ్యాను. ఓ మిడిల్ క్లాస్ ఫాదర్‌గా నరేశ్ నటించిన తీరుకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ మూవీకి ప్రధాన బలం కూడా ఆయనే. నరేశ్, వాసుకి గురించే ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటారు.
నీలఖి పాత్ర ఎలా ఉంటుంది? ఆమెతో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
అలేఖ్య పాత్రలో నీలఖి అద్భుతంగా నటించారు. ఇంటిమేట్ సీన్లలో నటించేందుకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. నీలఖికి ఎక్కడ అసౌకర్యం కలుగుతుందో అని అనుకునేవాడ్ని. కానీ, ఆమె మాత్రం పాత్రకు తగ్గట్టుగా నటించారు. ఆమె మాకు ఎంతో సహకరించారు.
దర్శకుడు వర్ధన్‌తో జర్నీ ఎలా అనిపించింది?
వర్ధన్‌తో నేను కథా చర్చల్లో కూడా పాల్గొన్నాను. ప్రతి చిన్న విషయాన్ని డీటైలింగ్‌గా మాట్లాడుకునే వాళ్లం. డైరెక్టర్ కథను అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ప్రతి పాత్రకు ఓ జస్టిఫికేషన్ ఇచ్చారు.
‘బ్యూటీ’ కోసం ఎక్కువ బడ్జెట్ పెట్టినట్టుగా కనిపిస్తోంది?
‘బ్యూటీ’ విషయంలో నిర్మాత విజయ్‌పాల్‌రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మాకు ఏం కావాలన్నా వెంటనే ఏర్పాటు చేసేవారు. ప్రొడక్ట్ బాగా రావాలనే ఎప్పుడూ పరితపించేవారు. ఇక మాకు అండగా మారుతి, జీ స్టూడియో నిలబడ్డారు. వారందరి సహకారంతోనే ‘బ్యూటీ’ ఇంత గొప్పగా వచ్చింది.
పాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మ్యూజిక్ గురించి చెప్పండి?
‘బ్యూటీ’ పాటలు అద్భుతంగా వచ్చాయి. ‘కన్నమ్మ’ పాట అయితే ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. విజయ్ బుల్గానిన్ మాకు మంచి పాటలు ఇచ్చారు. సినిమాలో ఆర్‌ఆర్ చూస్తే మా సినిమాను మరోస్థాయికి తీసుకు వెళ్లినట్టుగా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌కు అద్భుతమైన ఆర్‌ఆర్ ఇచ్చారు.
‘బ్యూటీ’ నుంచి ప్రేక్షకులు ఏం ఆశించొచ్చు?
‘బ్యూటీ’ ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో జరిగే కథ. అందరికీ తెలిసిన కథే. అయినా సరే అందరూ తెలుసుకోవాల్సిన కథ. ప్రతిఒక్కరూ ప్రస్తుతం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియపర్చే కథ ఇది. మిడిల్ క్లాస్ ఫాదర్ ఎమోషన్స్‌ను అద్భుతంగా చూపించాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది.