18-09-2025 08:47:33 PM
పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన బాధితులు..
చిట్యాల (విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన ఓ పత్రిక విలేకరి(విజయక్రాంతి కాదు) కట్కూరి మొగిలిపై చర్యలు తీసుకోవాలని గోపాలపూర్ గ్రామానికి చెందిన మూల కిరణ్, బండి తిరుపతి, చిట్యాల మండల కేంద్రానికి చెందిన గుర్రపు రవీందర్ కోరారు. బీసీ కార్పొరేషన్ లోన్లు, ఉద్యోగాల పేరిట తమ వద్ద డబ్బులు వసూలు చేశాడని స్థానిక పోలీస్ స్టేషన్ లో గురువారం వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ... కట్కూరి మొగిలి సాక్షరభారతిలో ఉద్యోగం చేసేవాడని తెలిపారు. కొన్నాళ్ళకు పరిచయం ఏర్పడి తమతో బీసీ కార్పొరేషన్ రుణాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడన్నారు. దీంతో కొన్ని డబ్బులు అతనికి అందజేసినట్లు పేర్కొన్నారు. ఏడు సంవత్సరాలు గడిచినా లోన్లు, ఉద్యోగాలు ఇప్పించలేదని, తిరిగి డబ్బులు ఇవ్వాలని అడిగినట్లు తెలిపారు. నేను ఎస్సీ కులానికి చెందిన అతనిని, పెద్ద పత్రిక విలేకరిని అని బెదిరిస్తున్నట్లు చెప్పారు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, కట్కూరి మొగిలిపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని వారు కోరారు.