calender_icon.png 31 December, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రంపహాడ్ జాతర ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలి

31-12-2025 07:44:28 PM

హనుమకొండ,(విజయక్రాంతి): అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మ జాతరకు అధికారులు సమన్వయంతో తగిన ఏర్పాట్లను పూర్తి చేసి విజయవంతంగా నిర్వహించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ లోని శ్రీ సమ్మక్క, సారలమ్మ ఆలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి జాతర ఏర్పాట్లు, నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ముందుగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం సమీక్షా సమావేశంలో వారు పాల్గొనగా  దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, విద్యుత్, ఆర్టీసీ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, సాగునీటిపారుదల, ఎక్సైజ్, అగ్నిమాపక, ఇతర శాఖల అధికారులతో ఆయా శాఖల ఆధ్వర్యంలో చేయాల్సిన జాతర ఏర్పాట్ల  గురించి ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్షించారు.

ఈ సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేసి ప్రశాంతంగా సాగే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. జాతరలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలన్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు కాబట్టి వాహనాల పార్కింగ్ సమస్య తలెత్తకుండా తగిన స్థలాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు.

పార్కింగ్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు చుట్టుపక్కల రైతులతో మాట్లాడి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని, సంబంధిత రైతులకు ఐదు వేల పరిహారం  అందజేయాలన్నారు. జాతరకు వచ్చే రహదారులలో మూలమలుపులు ఎక్కువగా ఉన్నాయని వాటి వద్ద తగిన జాగ్రత్త చర్యలు అధికారులు చేపట్టాలన్నారు. భక్తులు స్నానాలు చేసేందుకు ఎస్సారెస్పీ కెనాల్ లో తగిన నీరు ఉండేవిధంగా, అదేవిధంగా అగ్రంపహాడ్ చెరువు వద్ద కూడా సాగునీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమావేశం అనంతరం జాతర ఏర్పాట్లపై సమీక్ష చేసుకుని స్థల పరిశీలన చేసి తగిన చర్యలు చేపట్టాలన్నారు.

తాగునీటి సౌకర్యం మెరుగ్గా ఉండాలని, అదనంగా నీటి వసతులు కల్పించాలని మిషన్ భగీరథ శాఖ అధికారులకు సూచించారు. నిరంతర  విద్యుత్ సరఫరా చేయాలని, ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్ల వెంట తప్పనిసరిగా విద్యుత్ దీపాలు ఉండాలన్నారు. అదనంగా పోల్స్ ఏర్పాటు చేసి లైట్స్ పెట్టాలన్నారు. రోడ్లు బాగుండాలని, రోడ్లకు ఇరువైపులా జంగల్ క్లియరెన్స్ చేయించాలన్నారు. జాతరలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వాహనం అందుబాటులో ఉండాలన్నారు. జాతరలో గుడుంబా నియంత్రణ కు పోలీస్, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలన్నారు.

ఆలయ ప్రాంగణంలో పటిష్ట క్యూలైన్లు ఏర్పాట్లు చేయాలన్నారు.  పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వచ్చేనెల 20వ తేదీన మరోసారి జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలోనే  అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మ జాతర పెద్ద జాతర అని, ఈ జాతరకు సుమారుగా పది నుండి 12 లక్షలు మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తారని అన్నారు. ఇక్కడ దర్శనం చేసుకున్న అనంతరం మేడారానికి భక్తులు తరలి వెళ్తుంటారని పేర్కొన్నారు.

లక్షల సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వస్తుంటారు కాబట్టి జాతరకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జాతర ఏర్పాట్లు, నిర్వహణపై మరోసారి సమీక్ష చేయనున్నట్లు పేర్కొన్నారు. వివిధ శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆలయ ఈవో నాగేశ్వర్ రావు మాట్లాడుతూ జాతర నిర్వహణకు దేవాదాయ శాఖ తరపున ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు. గతంలో 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఈ జాతరకు వంద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.