20-11-2025 12:29:22 AM
మెదక్, నవంబర్ 19(విజయక్రాంతి):57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత నాణేల సేకరణ ఎగ్జిబిషన్ తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ మహిళల విజయాలను గుర్తించడం, వారికి సమానత్వం గురించి అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యమన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం అనేది ఒక సంప్రదాయంగా వస్తుందని, ఇది గ్రంథాలయాలలో మహిళల పాత్ర, ప్రాముఖ్యతను గుర్తించడం కోసం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, కార్యదర్శి వంశీకృష్ణ, సిబ్బంది జె.యాదగిరి పాల్గొన్నారు.