calender_icon.png 20 November, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతుల పేరుతో ఇసుక అక్రమ రవాణా

20-11-2025 12:29:34 AM

-మితిమీరిన వేగంతో మైనర్ల డ్రైవింగ్

-చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు 

కల్వకుర్తి నవంబర్ 19: ఇందిరమ్మ ఇల్లు, అభివృద్ధి పనుల పేరుతో  అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్న దుందుభి వాగు నుంచి ఇసుక దందా విచ్చలవిడిగా నడుస్తుంది.  అనుమతుల పేరుతో అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు రాత్రింబవళ్లు దుందిబి వాగు నుంచి ఇసుకను నిరభ్యంతరంగా తోడుతున్నారు.

కల్వకుర్తి మండలం లోని ఇందిరమ్మ ఇల్లు, పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి పేరుతో ఇసుకాసురులు నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. మండలంలోని లింగసానిపల్లి రఘుపతి పేట, వంగూరు మండలంలోని పోతారెడ్డి పల్లి సదగోడు ప్రాంతాల నుండి నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక రవాణా చేస్తున్నాయి.   అనుమతులు కొంత తీసుకొని అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా నిర్లక్ష్య ధోరణిలో ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత వారం రోజులుగా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి పేరుతో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక రవాణా చేస్తున్నా పని ప్రదేశంలో మాత్రం ఇప్పటికి 20 ట్రిప్పులు కూడా ఇసుక చేరలేదు. గవర్నమెంట్ పనులకు పది ట్రిప్పులు ఇసుక అందకపోయినా, ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్లు ఇసుక ఎటు పోతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు ఒక ట్రాక్టర్ కు తీసుకొని 10 ట్రాక్టర్లతో అదే నెంబర్ పై రవాణా చేస్తున్నారు. అధిక శాతం ట్రాక్టర్లకు నెంబర్ ప్లేట్లు తొలగించి రవాణాకు ఉపయోగిస్తున్నారు.

ప్రమాదకరంగా మైనర్ డ్రైవింగ్.

అధికారులు అనుమతి ఇస్తే పగటిపూట నడవాల్సిన ట్రాక్టర్లు రాత్రింబవళ్లు నడుస్తున్నాయి. రఘుపతిపేట నుండి కల్వకుర్తి వరకు రెండు వరుసల దారి నిర్మాణం పూర్తి కావడంతో ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ల కు యజమానులు ట్రిప్పుకు రూ ,300 ల చొప్పున చెల్లించడంతో ఎక్కువ ట్రిప్పులు కొట్టేందుకు వేగంగా నడుపుతున్నారు. ట్రాక్టర్ నడిపే వారిలో అధిక మంది డ్రైవర్లు మైనర్‌లు ఉండడం విశేషం. మైనింగ్, రెవె న్యూ ,పోలీస్,  రవాణా శాఖ ఎవరు కూడా అటువైపుగా చూడకపోవడంతో అక్రమ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతుంది. ప్రమాదాలు జరగక ముందే అధికారులు స్పందించి అర్హత గల డ్రైవర్లచే ట్రాక్టర్లు నడిపేలా చూడాలని, అక్రమ రవాణాను అడ్డుకొని అర్హులకు ఇసుక చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.