03-05-2025 05:15:31 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ప్రవేశపెట్టిన ఏసి బస్సులను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy), తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రారంభించారు. ఏసి బస్సు తొర్రూరు, తిరుమలగిరి, మోత్కూర్ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుందని చెప్పారు. ప్రయాణికులతో కలిసి కొత్త రాజధాని ఏసి బస్సులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టికెట్ కొని ప్రయాణం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. హైటెక్ హంగులతో ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఏసీ రాజధాని బస్సులను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. ప్రయాణికులకు సౌకర్యం కోసం సురక్షితమైన వేగవంతమైన ఏసి బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆర్టీసీలో వీలైనంత సాంకేతికతను ఉపయోగిస్తున్నామని తెలిపారు, బస్సు సేవలను అందరు వినియోగించుకోవాలని కోరారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరారు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా నిత్యం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.