calender_icon.png 26 December, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాలధారణ చేసిన ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి స్వరూపమే

26-12-2025 05:30:24 PM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్ (విజయక్రాంతి): నగరంలోని పద్మావతి కాలనీ లో గల ప్రసిద్ధ అయ్యప్ప కొండపై గురువారం భక్తిశ్రద్ధల మధ్య అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం అత్యంత భవ్యంగా నిర్వహించారు. మహా పడిపూజ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల కాలం పాటు (41 రోజులు) దీక్ష చేసిన అయ్యప్ప స్వాముల పూజలు ఫలించాలని ఆకాంక్షించారు.

అయ్యప్ప స్వాములు సంపూర్ణ నియమ నిష్ఠలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని నిత్యం కొలుస్తూ తరించడం ఎంతో అదృష్టమని అన్నారు. మాలధారణ చేసిన ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి స్వరూపమేనని, సామాన్య భక్తులు మీ రూపంలో స్వామి ఆశీస్సులు పొందారని పేర్కొన్నారు. అటువంటి గొప్ప అవకాశాన్ని అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన భక్తులకు కల్పించడం స్వామివారి అపార కృపేనని తెలిపారు. అయ్యప్ప స్వామి దీక్ష వలన మనలోని అహంకారం తొలగి, ఎదుటి వారిలోనూ భగవంతుని దర్శించుకునే అదృష్టం కలుగుతుందన్నారు.

ఈ దీక్ష ఆత్మశుద్ధి, నియమశీలత, సమానత్వ భావనలను పెంపొందించి మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందని చెప్పారు.  అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మహబూబ్‌నగర్ జిల్లా మరియు నియోజకవర్గం విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, మౌలిక వసతులు సహా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఐక్యతతో, పరస్పర గౌరవంతో జీవిస్తూ శాంతి, సౌభాగ్యాలతో ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో మంచి విలువలను పెంపొందించి, ముఖ్యంగా యువతను సక్రమ మార్గంలో నడిపించేందుకు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.