02-01-2026 07:40:22 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హైదరాబాద్ సేక్రటేరియట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు, వరంగల్ నగర మేయరు గుండు సుధారాణిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రితో విస్తృతంగా చర్చించి వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం వరంగల్ అని, గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రస్తుతం ఉన్న 66 డివిజన్లను జనాభా ప్రతిపదన పెరుగుదల దృష్ట్యా పెంచాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు, మేయర్ సీఎంకు వివరించినట్లు తెలిపారు. కాజీపేట బస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూ కేటాయింపు ప్రక్రియను రైల్వే శాఖ ద్వారా వేగవంతం చేయాలని, ఇప్పటికే రైల్వే అధికారులు సర్వే పూర్తి చేసిన విషయాన్ని సీఎంకు వివరించినట్లు, త్వరగా చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు, మాడవీధుల నిర్మాణం జరుగుతున్న అంశాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కి వివరించారు. భద్రకాళి అమ్మవారి దర్శనానికి వరంగల్ కు రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగరాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.