22-07-2025 12:32:44 AM
- మొన్న లిక్కర్ కేసు.. తాజాగా హెచ్‌సీఏ నిధుల గోల్‌మాల్!
- నిజామాబాద్ జిల్లాలో ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా?
- బినామీల వివరాలు సేకరిస్తున్నట్లు వార్తలు
నిజామాబాద్, జూలై 21 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో సైతం ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత మరో కుంభకోణంలో ఉన్నట్టు ఈడీకి ఫిర్యాదు అందింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అవినీతిలోనూ కవితకు భాగం ఉందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీతో పాటు రాష్ట్ర సీఐడీకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) తాజాగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
హెచ్‌సీఏలో పదేళ్లలో దాదాపు రూ.600 కోట్లకు పైగా నిధులు గోల్‌మాల్ అయ్యాయని, ఇందుకు సంబంధించిన పెన్‌డ్రైవ్ డాక్యుమెంట్లను ఈడీకి టీసీఏ ప్రతినిధు లు ఎండల లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రెటరీ దారం గురువారెడ్డి పంపించినట్లు తెలుస్తోం ది. అలాగే ఇటీవల హైదరాబాద్‌లో సీఐడీ చీఫ్ చారుసిన్హాను కలిసి సంబంధిత డాక్యుమెంట్లను అందజేసి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ నేపథ్యంలో కవిత ఆస్తులకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని సీఐడీని ఈడీ కోరినట్లు సమాచారం.
రంగంలోకి ఈడీ
పలు కుంభకోణాల్లో ఎమ్మెల్సీ కవిత భాగస్వామ్యం ఉందంటూ ఈడీకి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఆమె సొంతూరైన నిజామాబాద్ జిల్లాలో ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కవిత స్థిరాస్తులు, ఆర్థిక లావాదేవీలు, బినామీల విషయమై ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. నిజామాబాద్, నిర్మల్ సరిహద్దులో వ్యవసాయ భూములు, నిజామాబాద్ నగరంలోని కవిత క్యాంప్ కార్యాలయం, కవిత భర్త అనిల్ వ్యాపార లావాదేవీలు, అనిల్ కు టుంబం నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ వెంచ ర్లు, స్థానిక కలెక్టరేట్ వద్ద బినామీల పేరు మీద ఉన్న ఖరీదైన భూముల వివరాలను ఇంటెలిజెన్స్ అధికారులు సేకరిస్తున్నట్లు తెలిసింది.
బినామీల గుర్తింపు
నిజామాబాద్ నగర శివారులో గల ఒక పారిశ్రామికవేత్త నుంచి కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిన వివరాల ప్రకారం జగిత్యాలకు చెందిన ఒక డాక్టర్‌ను కవిత బినామీగా గుర్తించినట్టు తెలుస్తోంది. జిల్లా యంత్రాంగంతో పాటు రాజకీయ ఒత్తిళ్లతో స్థిరాస్తుల మార్పు జరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈడీ దాడులు జరగనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌తో పాటు పొరుగు జిల్లా సరిహద్దుల్లోని విలువైన ఖనిజాలను అక్రమంగా మైనింగ్ చేస్తున్న శ్రీనివాస అనే సంస్థ ఎగుమతులపైనా ఆరా తీస్తు న్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వీరికి అన్ని రకాలుగా సహకరించిన ఓ ఐపీఎస్ అధికారి, మరో రెవెన్యూ ఉద్యోగి ఆస్తుల వివరాలను కూడా సేకరించినట్టు తెలుస్తోంది.
జాగృతి కార్యక్రమాలపై ఆరా
తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా నిర్వహించిన స్వచ్ఛంద, చేయూత కార్యక్రమాలు, ఆర్థిక లావాదేవీలు తదితర వివరాలపై సైతం ఈడీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జాగృతికి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు కవిత ప్రకటించడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌లో ఇంటెలిజెన్స్ వర్గాలు కవిత ఆస్తుల తాలూకు బినామీల వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన సమీప బంధువులు, మాజీ ఎమ్మెల్యేలు వారి పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలు ఈడీ దృష్టికి వచ్చినట్టు సమాచారం.