calender_icon.png 13 January, 2026 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబైకి వస్తే కాళ్లు నరికేస్తాం

13-01-2026 01:55:23 AM

నగరంతో మీకేంటి సంబంధం

మీరు అన్నామలై కాదు.. రసమలై

తమిళనాడు బీజేపీ నేత అన్నామలైపై ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్ థాక్రే తీవ్ర వ్యాఖ్యలు

మరాఠీల అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపణలు

ముంబై, జనవరి ౧౨: ‘అన్నామలై.. ముంబై నగరం మరాఠీ ప్రజల అస్తిత్వం. నగరంతో మీకేంటి సంబంధం ? మీరు ముంబైలో అడుగు పెడితే కాళ్లు నరికేస్తాం. మహారాష్ట్ర నుంచి ముంబైని వేరు చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను సాగనివ్వం’ అని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు(ఎంఎన్‌ఎస్) రాజ్‌థాక్రే నిప్పులు చెరిగారు. ముంబై అంతర్జాతీయ నగరమని, నగర బడ్జెట్ రూ.75 వేల కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని, అందుకే నగరంపై కేంద్రం పట్టు ఉండాలని తమిళనాడుకు చెందిన బీజేపీ నేత అన్నామలై ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై ఆయన భగ్గుమన్నారు.

‘ముంబై అనే అభివృద్ధి కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం ఫడ్నవీస్, బీఎంసీలో బీజేపీ మేయర్ పట్టు ఉండాలని, అప్పుడే ఈ అంతర్జాతీయ నగరానికి సరైన న్యాయం జరుగుతుంది’ అన్నామలై మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ సందర్భంగా తన బాబాయ్ రాజ్ థాక్రే 1960 -70 ప్రాంతంలో చేసిన నినాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ‘హఠావో లుంగీ, బజావో పుంగీ’ నినదించి, ‘రసమలై’ అంటూ అన్నామలైని ఎద్దేవా చేశారు. ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని రాజ్ థాకరే ఆరోపించారు. అన్నామలై వంటి వారి విద్వేషపూరిత వ్యాఖ్యలు మహారాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీస్తాయమని అభిప్రాయపడ్డారు.

ముంబై మున్సిపల్ ఎన్నికలు మరాఠీ మనుషుల మనుగడకు అంతిమ పోరాటమని అభివర్ణించారు. మరాఠీ ప్రజలపై హిందీ రుద్దేందుకు ప్రయత్నిస్తే బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన వారిని తరిమికొడతాం’ అంటూ హెచ్చరించారు. ‘ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్లు హిందీ మరాఠీ ప్రజల భాష కాదని అర్థం చేసుకోవాలి. నాకు భాష అంటే ఏమాత్రం ద్వేషం లేదు. కానీ మీరు మీ హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునేది లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. జన్మభూమి, భాష పరాయి వాళ్ల పాలైతే ఏ జాతికైనా భవిష్యత్తు ఉండదని అభిప్రాయపడ్డారు. ముంబైని గుజరాత్ ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులు ముంబైని గుజరాత్‌తో అనుసంధానించడానికేనని, కార్పొరేట్ శక్తులైన అదానీ వంటి పారిశ్రామికవేత్తలకు నగర భూములను కట్టబెట్టేందుకు బీజేపీ పరితపిస్తోందని దుయ్యబట్టారు. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ.. ముంబై నగరాన్ని బొంబాయిగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు అన్నామలై వ్యాఖ్యలను శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే సైతం ఖండించారు.