calender_icon.png 13 January, 2026 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరు నరుకుతారో చూస్తా

13-01-2026 01:52:47 AM

నేను ముంబైకి వస్తా.. ఏమాత్రం బెదిరేది లేలదు

రాజ్‌థాక్రే వ్యాఖ్యలకు నేను భయపడను

లుంగీలు, ధోతీలు ధరించే తమిళులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు

తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఆగ్రహం

చెన్నై, జనవరి ౧౨: ‘రాజ్ థాక్రే ఎవరు నన్ను బెదిరించడానికి? నేను ఒక రైతు బిడ్డను. ఆయన కేవలం నన్ను తిట్టడానికే సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేను కచ్చితంగా ముంబైకి వస్తా. నా కాళ్లు ఎవరు.. ఎలా నరుకుతారో చూస్తా.. అలాంటి బెదిరింపులకు భయపడితే నేను నా ఊరిలోనే ఉండిపోయేవాడిని. గొప్పనేతలను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన వాడిని నేను. ఎవరో బెదిరిస్తే బెదురుతానా’ అంటూ తమిళనాడు బీజేపీ నేత అన్నామలై తీవ్రంగా స్పందించారు. తాను ముంబైకి వస్తే అడ్డుకుంటానని, అవసరమైతే కాళ్లు నరుకుతానని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్)అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై సోమవారం అన్నామలై స్పందించారు.

తాను ముంబైలో అడుగుపెడితే కాళ్లు నరికేస్తామని కొందరు బెదిరింపులకు దిగుతున్నారని, అలాంటి తాటాకుచప్పుళ్లకు తాను భయపడేది లేదని కొట్టిపడేశారు. ముంబై గురించి మాట్లాడే అర్హత రాజ్‌థాక్రేకి లేదని వ్యాఖ్యానించారు. ముంబై ఒక అంతర్జాతీయ నగరమని, ఇప్పటికీ తాను అదే మాటపై నిలబడి ఉంటాయనని స్పష్టం చేశారు. తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే థాక్రే సోదరులు మరాఠీ అస్తిత్వం పేరుతో ఇతర ప్రాంతాల వారిని, ముఖ్యంగా తమిళులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ‘లుంగీ ఉఠావో.. పుంగి బజావో’ అంటూ లుంగీలు, ధోతీలు ధరించే వారిని ఉద్దేశించి రాజ్ థాక్రే చేసిన వ్యాఖ్యలు మొత్తం తమిళ జాతిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. థాక్రే సోదరులు అభివృద్ధిపై చర్చించలేకనే ఇలాంటి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.