22-11-2025 12:22:33 AM
* సహకరిస్తున్న ఎంఇఓ, డీఈఓలపై చర్యలు తీసుకోవాలి
* ప్రజా సంఘాలు డిమాండ్
కాటారం (మల్హర్), నవంబర్ 21 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్ డెవలప్మెంట్ కోసం పిమ్ సి నిధులు 21 లక్షల రూపాయలు మంజూరు కాగా పాఠశాలలో ఏలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా, తప్పుడు లెక్కలు చూపించి, స్థానిక రాజకీయ నాయకుల అండతో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభుత్వ నిధులు స్వాహా చేశాడని ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు.
కొయ్యూరు లో విలేకరుల సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మోడల్ స్కూల్ లో నైట్ వాచ్ మెన్ డ్యూటీ చేయకుండానే, వాచ్ మెన్ పేరు మీద వచ్చిన జీతాన్ని సైతం ప్రిన్సిపాల్ తీసుకొని సొంతానికి వాడుకొంటున్నాడని వారు ఆరోపించారు. మోడల్ స్కూల్ లో రెగ్యులర్ గా ఇద్దరు స్కావెంజర్లను నియమించాల్సి ఉండగా, ఒక వర్కర్ ను నియమించి, మరో వర్కర్ లేకున్నా రికార్డు లో చూపించి ఒక వర్కర్ జీతం ప్రిన్సిపాల్ అమాంతం మింగుతున్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
వెంటనే సంబంధిత ఉన్నత అధికారులు ఎడ్లపల్లి మోడల్ స్కూల్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై దృష్టి సారించి పాఠశాల నిధులను స్వంతానికి వాడుకున్న ప్రిన్సిపాల్, అతనికి సహకరించిన రాజకీయ నాయకులు, ఎంఈఓ, డిఈఓ లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అలాగే మండలం లోని మల్లారం కెజిబివి పాఠశాలలో పిల్లలకు భోజనం సక్రమంగా పెట్టడం లేదని, ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మెనూ ప్రకారం భోజనం పిల్లలకు అందించక నానా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
వెంటనే ఉన్నత అధికారులు మల్లారం కెజిబివి పాఠశాలను సందర్శించి అందులో పనిచేసే ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఏకమై భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వానికి హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఐతు బాపు, యువైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు పీక కిరణ్, ఆదివాసీ మహిళా నాయకురాలు కాల్నేని లక్ష్మి, దళిత నాయకులు మంథెన మహేష్, అక్కపాక శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు.