15-07-2025 12:05:21 AM
పటాన్ చెరు ఎమ్మెల్యే జీఎంఆర్
పటాన్ చెరు, జులై 14 : పటాన్ చెరు పట్టణంలో రూ.20 కోట్లతో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆధునికంగా చేపట్టిన ఆడిటోరియం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. 4 వేల మంది సీటింగ్ సామర్థ్యంతో అందరికి ఉపయోగపడేలా ఈ ఆడిటోరియం నిర్మిస్తున్నట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఆడిటోరియం పనులను జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, తెలంగాణ గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసిన దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుని ఆడిటోరియానికి పెడుతున్నట్టు ఆయన తెలిపారు. ఆడిటోరియం ఎదురుగా పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. భవిష్యత్తు తరాలకు పీవీ నరసింహారావు గొప్పతనాన్ని తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆడిటోరియం నిర్మాణానికి గతంలో ఎంఎస్‌ఎన్ ఫార్మా పరిశ్రమ రూ.8 కోట్లు, అరబిందో సంస్థ రూ.2 కోట్ల సీఎస్‌ఆర్ నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ నుంచి రూ.4 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వివిధ పరిశ్రమల సహకారంతో మిగిలిన రూ.6 కోట్ల నిధులు ఆడిటోరియం అభివృద్ధికి కేటాయిస్తామన్నారు. అతి త్వరలో నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఈఈ సురేష్, డీఈ నరేందర్, ఏఈ శివ కుమార్ తదితరులుపాల్గొన్నారు.