30-10-2025 01:21:00 AM
-రాహుల్ పీఎం కావాలన్న సోనియా ఆశ.. తేజస్వీ సీఎం కావాలన్న లాలూ కోరిక కల్ల
-కేంద్ర మంత్రి అమిత్‌షా
పాట్నా, అక్టోబర్ 29: ‘ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజస్వీయాదవ్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని ఆశపడుతున్నారు. కానీ.. ప్రధానిగా మోదీ, బీహార్ సీఎంగా నితీశే కొనసాగుతారు. ప్రస్తుతం ఆ రెండు స్థానాలు ఖాళీగా లేవని.. సోనియా, లాలూ ఆశలు ఎప్పటికీ కల్లలుగానే మిగులుతాయి’ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎద్దేవా చేశారు.
బీహార్‌లోని బెగుసరాయ్, దర్భంగాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా మాట్లాడారు. లాలా ప్రసాద్ యాదవ్, తేజస్వీయాదవ్ అక్రమార్కులకు అండగా నిలవాలని చూస్తున్నారని, బీహార్ ప్రజలు వారికి ఆ అవకాశం కల్పించొద్దని పిలుపుఇచ్చారు. దేశంలో అక్రమంగా చొరబడి వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలంటే, యూఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఉగ్రవాదాన్ని , నక్సలిజాన్ని ఏమాత్రం ఉపేక్షించదని తేల్చిచెప్పారు. ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకులను పొట్టన పెట్టుకున్న వెంటనే ప్రధాని మోదీ స్పందించి ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టారని గుర్తుచేశారు.