30-10-2025 10:23:42 PM
హనుమకొండ (విజయక్రాంతి): మొంథా తుఫాన్ ప్రభావంతో నయీమ్ నగర్ నాలా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం ప్రాంతాన్ని సందర్శించారు. నాలా పరివాహక ప్రాంతంలో ఉన్న పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలో గతంలో భారీ వర్షాల కారణంగా జరిగిన ఘటనలు ఈసారి పునరావృతం కాకుండా కొంత మేర చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో ఇటువంటి ప్రమాదాలను అడ్డుకునేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాల్సిందిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచించారు.