calender_icon.png 31 October, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రఫేల్‌లో రాష్ట్రపతి గగన విహారం

30-10-2025 01:25:15 AM

-అంబాల్ ఎయిర్‌బేస్ నుంచి ముర్ము ప్రయాణం

-పైలట్‌గా ‘గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్ టీం శివాంగీసింగ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపదీ ముర్ము బుధవారం రఫేల్ యుద్ధ విమానంలో సుమారు అరగంట పాటు గగనవిహారం చేశారు. హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్ ‘గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్ టీం లీడర్ శివాంగీ సింగ్ పైలట్‌గా ఆమె ఈ పర్యటనను విజయవంతం చేశారు. రాష్ట్రపతి ముర్ము ఫైటర్ జెట్‌లో ప్రయాణించడం ఇది రెండోసారి. చివరిసారి 2023 ఏప్రిల్‌లో ఆమె సుఖోయ్ -30 ఫైైటర్ జెట్‌లో ప్రయాణించారు.

తాజాగా రాఫేల్ జెట్‌లో ప్రయాణించి రికార్డు సృష్టించారు. ఈ విహారానికి సంబంధించిన సంబంధించిన ఫొటోలను భారత వాయుసేన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో శివాంగీ సింగ్‌ను బంధించినట్లు నాడు పాకిస్తాన్ అబద్ధపు ప్రచారం చేసింది. అయితే.. అదంతా ఫేక్ ప్రచారమని భారత ప్రభుత్వం అప్పట్లోనే ఖండించింది. రాష్ట్ట్రపతి ముర్ము తాజాగా ఫొటో దిగడంతో మరోసారి శివాంగీ వార్తల్లో నిలిచారు.

శివాంగీ సింగ్ వారణాసి.  ఆమె పాఠశాల విద్యాభ్యాసం స్వస్థలంలోనే సాగింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆమె డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఎన్‌సీసీలో చేరారు. 2016లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2017లో రెండో దశ యుద్ధ విమాన పైలట్లలో ఒకరిగా ఎంపికయ్యారు. ‘మిగ్ బైసన్’ యుద్ధ విమానాలు నడపడంలో ప్రావీణ్యం సాధించారు. ఆ అనుభవంతోనే 2020లో ఆమె అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం దక్కించుకున్నారు. అప్పటి నుంచి అంబాలా ఎయిర్‌బేస్‌లోని ‘గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్ బృందంలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్నారు.