30-10-2025 01:19:33 AM
-ఓట్ల లబ్ధికోసం ప్రధాని మోదీ ఎలాంటి డ్రామాకైనా సిద్ధం
-సామాజిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకం
-ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ
పాట్నా, అక్టోబర్ 29: ఓట్ల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పడరానిపాట్లు పడుతున్నారని, ఓట్లు వస్తాయంటే ఆయన భరతనాట్యం చేయమన్నా చేస్తారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌తో కలిసి దర్భంగా, ముజఫర్‌నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మోదీ ఎలాంటి డ్రామా అయినా ఆడతారని విమర్శించారు.
మోదీ తాజాగా యుమనా నది ఒడ్డున నకిలీ పవిత్రస్నానం చేశారని ఆరోపించారు. ఇటీవల యుమునా తీరంలో ఛట్ పూజలో పాల్గొన్న ప్రధాని.. నదిలో కాకుండా, ఒడ్డున ఒక కుంటను తవ్వించారని తెలిపారు. కుంటలోకి పైప్‌లైన్ ద్వారా నీళ్లు తెప్పించుకుని స్నానమాచరించారని గుర్తుచేశారు. ఈ చర్య ద్వారా మోదీ యమునా పూర్తిగా కలుషితమైందని దేశప్రజలు చాటిచెప్పారని అభిప్రాయపడ్డారు. బీహార్‌లో జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ను అడ్డంపెట్టుకుని బీజేపీ రిమోట్ కంట్రోల్ పాలన చేయాలని చూస్తోందని ఆరోపించారు.
నితీశ్‌ను బీజేపీ కేవలం ఒక పావులా వాడుకుంటున్నదని అభిప్రాయపడ్డారు. సామాజికన్యాయానికి బీజేపీ పూర్తి వ్యతిరేకమని, ప్రతిపక్షాలు పట్టుబట్టడం వల్లే ప్రధాని మోదీ కులగణనకు అంగీకరించారని పేరొన్నారు. బీజేపీ మహారాష్ట్ర, హర్యానాలో భారీగా ఓట్ల చోరీకి పాల్పడిందని, అదే విధంగా బీహార్‌లోనూ ఓట్ల చోరీకి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దేశ సంపద కేవలం కొంతమంది సంపన్నుల చేతుల్లోకి వెళ్తున్నదని, బీహార్ వంటి రాష్ట్రాలు పేదరికంలో కూరుకుపోవడానికి అదే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.
భూమిలేని నిరుపేదలకు భూమి ఇవ్వాలంటే, భూమి కొరత ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తున్నారని, అదే నిజమైతే కార్పొరేట్ శక్తులు అదానీ, అంబానీ కంపెనీలకు ఎలా ఒక్క రూపాయికే భూములు కట్టబెడుతున్నారని నిలదీశారు. అంబానీ, అదానీకి భూమి కావాలనుకుంటే, వారు ఎంత ఖర్చు చేసైనా భూమి దక్కించుకుంటారని, వారికి పేదల నుంచి భూములు ఎందుకు లాక్కుని ఇస్తున్నారని నిప్పులు చెరిగారు. బడా వ్యాపారవేత్తల రుణాలను మాఫీ చేయడమే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో అభివృద్ధి అని ధ్వజమెత్తారు.