15-07-2025 01:09:16 AM
నల్లగొండ, జూలై 14( విజయక్రాంతి) : అది నల్లగొండ జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం. అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి వల్ల జిల్లా విద్యుత్ శాఖ మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ సర్కిల్.. ఆ సర్కిల్.. సెక్షన్.. సబ్ సెష్టన్, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు అంటూ తేడా ఏం లేదు. తాను చేసే విధులను పక్కకు పెట్టి అన్నింటిల్లోనూ వేలుపెట్టడం అతడి నైజం.
సదరు ఉద్యోగి విద్యుత్ శాఖకు సంబంధించి ఓ యూనియన్లో కీలకంగా వ్యవహరిస్తుండడంతో సదరు ఉద్యోగి ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిపోయింది. సదరు ఉద్యోగి పుణ్యమంటూ జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో పనిచేసే వారి దగ్గరి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే విద్యుత్ సిబ్బంది సైతం ఇబ్బంది పడుతుండడం గమనార్హం.
జిల్లా విద్యుత్ కార్యాలయంలో పనిచేసే అటెండర్లు, జూనియర్ అసిస్టెంట్ల దగ్గరి నుంచి మొదలుకుంటే.. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్మెన్లు, హెల్పర్ల విషయంలోనూ జోక్యం చేసుకోవడం.. ఏమాత్రం తేడా వచ్చినా పరిస్థితిని తారుమారు చేయడం పరిపాటిగా మారింది. ఇంత జరుగుతున్నా.. జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మౌనం వహిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది.
పాలసీలకు విరుద్ధంగా బదిలీలు..
విద్యుత్ శాఖలో బదిలీలు జరగాలన్నా.. ప్రమోషన్లు ఇవ్వాలన్నా.. ఓ సిస్టమ్ ప్రకారం జరుగుతుంటుంది. సినీయార్టితో పాటు విధుల్లో అలసత్వం, డుమ్మా కొట్టడం, సర్వీసు బుక్ రూల్స్ తదితరాలన్నింటినీ మెయింటెన్ చేస్తుంటారు. కానీ సదరు ఉద్యోగి మాత్రం తన అనుకున్న వారి కోసం ఈ రూల్స్ అన్నింటికీ పక్కకు తప్పించి ఉద్యోగులపై తీవ్రస్థాయిలో ప్రెజర్ చేసి తన పనులు చకాచకా చేసుకుంటున్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో పనిచేసే లైన్మెన్, జూనియర్ లైన్మెన్ ఇద్దరినీ ఇటీవల ఎలాంటి ట్రాన్స్ఫర్ పాలసీని పాటించకుండా జిల్లా కేంద్రంలోని మరో కాలనీకి ట్రాన్స్ఫర్ చేయించారు. అయితే సదరు ప్రాంతం ప్రస్తుతం విపరీతంగా డవలప్ అవుతుండడం వల్ల కొత్త సర్వీసు కనెక్షన్లు, ప్యానెల్ బోర్డు తరహాలో కనెక్షన్ల కోసం భారీగా అమ్యామ్యాలు దక్కుతుంటాయి. ఈ క్రమంలోనే సదరు లైన్మెన్, జూనియర్ లైన్మెన్ దాదాపు రూ.2 లక్షలు ఖర్చు చేసి సదరు యూనియన్ లీడర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారనే ఆరోపణలు సొంత శాఖలో జోరుగా విన్పిస్తున్నాయి.
ఉన్నతాధికారుల చోద్యం..
జిల్లా కేంద్రంలో పనిచేసే ఓ విద్యుత్ ఉద్యోగి ఇంత చేస్తున్నా.. అంతా తెలిసి ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. విధుల్లో అలసత్వం వహిస్తే.. సాధారణ ఉద్యోగులపై క్షణాల్లో చర్యలు తీసుకునే ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై మౌనం వహిస్తుండడంపై సొంతశాఖలో గుసగుసలు విన్పిస్తున్నాయి.
సొంత శాఖలో పనిచేసే ఓ సాధారణ ఉద్యోగి యూనియన్ పేరుతో ప్రమోషన్లు, బదిలీలు జోక్యం చేసుకుని వ్యవస్థను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నా.. అధికారుల నుంచి స్పందనలేకపోవడం దారుణమనే చెప్పాలి. మరీ ఇప్పటికైనా అంతర్గత విచారణ జరిపి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటారా..? లేక షరా మాములుగానే వదిలేస్తారో చూడాలి.
మచ్చుకు సదరు ఉద్యోగి ఆగడాలు..
ఇటీవల కాలంలో జిల్లాలోని ఓ సెక్షన్లో రాంగ్ ఎల్సీ ఇవ్వడం వల్ల ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన లైన్మెన్, ఆపరేటర్ల మీద ఇంతవరకు ఏలాంటి చర్య తీసుకోలేదు. దీనికి ప్రధాన కారణం సదరు ఉద్యోగి కావడం కొసమెరుపు. సదరు సిబ్బంది మీద చర్యలు తీసుకోకుండా సర్దుబాటు తంతును ఆయన కనుసన్నల్లోనే సాగించారు.
జిల్లాలోని ఓ విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ ప్రమోషన్కు సంబంధించిన వ్యవహారం పెచీ పడింది. ఈ ప్రమోషన్ కోసం ఇద్దరు వ్యక్తులు జాబితాలో ఉన్నారు. అయితే మొదటి వరుసలో ఉన్న వ్యక్తికి సర్వీసు బుక్లో రిమార్కులు ఉన్నాయి. విధుల్లో అలసత్వం వల్ల గతంలో సస్పెన్షన్ పడింది. ఆ తర్వాతి ప్రక్రియ అంతా పెండింగ్ పడింది. దీంతో తర్వాతి వ్యక్తి ప్రమోషన్కు అర్హుడు.
కానీ జిల్లా కేంద్రంలో పనిచేసే సదరు యూనియన్ లీడర్ కమ్ ఉద్యోగి స్థానిక అధికారులపై ఒత్తిడి తెచ్చి పాత డేట్తో రికార్డుల్లో మార్పులు చేయాలని బెదిరింపులకు దిగాడు. కానీ పని ప్రస్తుతం పెండింగ్లో పడిపోయింది. అర్హత లేని వ్యక్తికి ప్రమోషన్ ఇప్పించేందుకు సదరు ఉద్యోగి భారీ మొత్తంలో సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు జోరందుకున్నాయి. ఓ సెక్షన్లో పనిచేసే ఆర్టిజన్ ఉద్యోగి జిల్లా కేంద్రానికి పక్కన ఉన్న మండల కేంద్రంలో జాయిన్ కావాల్సి ఉంది.
అయితే డివిజనల్ ఇంజనీర్(డీఈ) ఇచ్చిన ఆర్డర్ను సైతం వ్యతిరేకించి జిల్లా కేంద్రంలోనే పనిచేయిస్తుండడం కొసమెరుపు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కనీసం నోరు మెదపడం లేదు. జిల్లా కేంద్రంలోని ఓ సెక్షన్లో మరో సెక్షన్లో పనిచేసే ఉద్యోగి వచ్చి జాయిన్ కావాల్సి ఉంది. కానీ బదిలీలు జరిగి నెలలు గడుస్తున్నా.. నేటి వరకు జాయిన్ కాలేదు. పాతస్థానంలో పనిచేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
ఇదంతా ఒక ఎత్తయితే.. సదరు ఉద్యోగి ఓ యూనియన్లో సైతం కీలకంగా వ్యవహరిస్తుండడం వల్ల ఎవరైనా ఉద్యోగులు వేరే యూనియన్లో చేరితే టార్గెట్ చేసి మరి ముప్పుతిప్పులు పెడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు.