calender_icon.png 12 January, 2026 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రబీ బోనస్‌కు రాం.. రాం?

12-01-2026 12:00:00 AM

పంట అమ్మి ఆరు నెలలు దాటినా అందని డబ్బులు

వస్తాయా? రావా? అని రైతన్నల ఎదురు చూపులు...

తిరిగి ప్రారంభమవుతున్న రబీ సీజన్...

ఓ సీజన్ వదిలి మరో సీజన్ ఇవ్వడంలో అంతర్యమేమిటో...!

మంచిర్యాల, జనవరి 11 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో 2025- వానాకాలం (ఖరీఫ్) సీజన్ ధాన్యం కొనుగోళ్లు ముగియనున్నాయి. రైతులు మరోవైపు రబీ సీజన్ లో పంటలు సాగు చేసేందుకు సిద్దమవుతున్నారు. కొన్ని ప్రాంతాలలో వరి నాట్లు పూర్తవ గా మరి కొంత మంది రైతులు వేసే పనిలో నిమగ్నమవుతున్నారు. కానీ ఇంత వరకు 2024- సంవత్సరానికి సంబంధించి రబీ సీజన్ బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు.

ఆరు నెలలు దాటినా బోనస్ డబ్బులు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకెప్పుడు ఇస్తారోనని ఎదురు చూస్తున్నారు. గత రబీ సీజన్ లో 1,97,590. 920 (దొడ్డు1,90,665.120, సన్న రకం 6,925.800 ) మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దొడ్డు రకాలకు సంబంధించి రైతు లకు రూ.454,76,57,616 చెల్లించారు. సన్నా లు సాగు చేసిన రైతులకు బోనస్ పడక ఇబ్బందులు పడుతున్నారు. ఈ బోనస్ ను బోగస్ చేస్తారేమోనని ఆందోళన పడుతున్నారు.

ఓ సీజన్ వదిలి మరో సీజన్ బోనస్.. 

గత ఏడాది రబీ సీజన్ బోనస్ చెల్లించకుం డా ఈ ఏడాది వానా కాలం సీజన్ కు సంబంధించి రైతులు అమ్మిన సన్న ధాన్యానికి మద్ద తు ధరతో పాటు ప్రభుత్వం క్వింటాళుకు రూ. 500 బోనస్‌ను జమ చేస్తుంది. గత ఏడాది డబ్బులు చెల్లించకుండా ప్రస్తుత సీజన్ డబ్బు లు చెల్లిస్తుండటం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రబీలో కష్టమైనా సన్న ధాన్యం పండించిన రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఎం దుకు జాప్యం చేస్తుందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలు దాటినా బోనస్ రాకపోవడంతో కౌలు రైతులు పట్టాదారు రైతుకు బోనస్ తో కలిపి చెల్లించి ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసం బ్యాంకుల చుట్టు తిరుగుతున్నామని వాపోతున్నారు.

1041 మంది ఎదురు చూపులు... 

మంచిర్యాల జిల్లాలో 1041 మంది రైతు లు రూ. 3.46 కోట్ల బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని చెన్నూర్ నియోజక వర్గంలోని 576 మంది రైతులకు, బెల్లంపల్లి నియోజక వర్గంలోని 141 మంది రైతులకు, ఖానాపూర్ నియోజక వర్గంలోని జన్నారం మండలంలోని 23 మంది రైతులకు రావాల్సిన బోనస్ డబ్బు ఎప్పుడు వస్తాయా అని పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో 18 మండలాలుండగా 15 మండలాల్లో సన్న రకాలు సాగు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి బోనస్ డబ్బుల కోసం అయ్యో రామ అంటూ ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఏజెన్సీలపై పెరుగుతున్న ఒత్తిడి...

రైతుల వద్ద నుంచి నాలుగు ఏజెన్సీల పరిధిలోని 345 కొనుగోలు కేంద్రాల నుంచి సివి ల్ సప్లయ్ అధికారులు ధాన్యం కొనుగోళ్లు జరిపారు.  డీఆర్డీఏ(ఐకేపీ) ఏజెన్సీ పరిధిలోని 167 కొనుగోలు కేంద్రాల్లో 559 మంది రైతు ల వద్ద 3448.120 మెట్రిక్ టన్నుల సన్నాలు కొనుగోలు చేసి రూ. 1,72,40,600 చెల్లించా ల్సి ఉంది. అలాగే మెప్మా పరిధిలోని ఏడు కేం ద్రాల్లో 31 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 195.560 మెట్రిక్ టన్నుల సన్నాలకు రూ. 9,77,800, పీఏసీఎస్ పరిధిలోని 106 కొనుగోలు కేంద్రాల నుంచి 221 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 1260.480 మెట్రిక్ టన్నుల సన్నాలకు రూ. 63,02,400, డీసీఎంఎస్ ఏజెన్సీ పరిధిలోని 65 కొనుగోలు కేంద్రాల నుంచి 230 మంది రైతుల నుంచి 2021.640 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా రైతులకు రూ. 1,01,08, 200 చెల్లించాల్సి ఉంది. రైతులు ఆయా ఏజన్సీల్లోని కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల చుట్టూ బోనస్ కోసం తిరుగుతున్నారు. అసలు వస్తా యా? రావా? అని ప్రశ్నిస్తున్నారు.

బోనస్ ఎగవేయాలని చూస్తే ఊరుకోం... 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కు న్యాయంగా చెల్లించాల్సిన రబీ బోనస్ డబ్బులు చెల్లించకుండా మోసం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మంచిర్యాల జిల్లాలోనే దాదాపు మూడున్నర కోట్ల బోనస్ రైతులకు ఇవ్వాలంటే రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల బోనస్ ఎగ్గొట్టాలని చూస్తుంది. అందుకే రబీ సీజన్ కు సంబంధించిన బోనస్ రైతుల ఖాతాల్లో వేయకుండా ప్రస్తుతం ముగియవస్తున్న వానా కాలం సీజన్ బోనస్ ఇవ్వడం ఏంటి. కాంగ్రెస్ రైతులను చిన్న చూపు చూస్తుంది.

మరో వైపు పంటలకు పెట్టుబడి సాయం కింద ప్రతి సీజన్ ఆరంభం ముందు రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధును నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది. ఒక రైతులనే కాకుండా రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తుంది. ఇప్పటికైనా రైతులు కష్టపడి పండించిన పం టకు ఇవ్వాల్సిన బోనస్‌ను వెంటనే వారి వారి ఖాతాల్లో జమ చేయాలి. లేదంటే రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

 బాల్క సుమన్, మాజీ ఎంపీ