15-05-2025 12:08:52 AM
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న తాజాచిత్రం ‘కింగ్‌డమ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే ఓ ముఖ్యపాత్రలో నటిస్తోంది. మే 30న విడుదల కావాల్సిన ఈ సినిమా జూలై 4వ తేదీకి వాయిదా పడింది.
ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘ముందుగా అనుకున్నట్టే మే 30కే సినిమాను తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాం. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్స్, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి, ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జోమోన్ టీ జాన్ ఐఎస్‌సీ, గిరీష్ గంగాధరన్ ఐఎస్‌సీ; సంగీతం: అనిరుధ్ రవిచందర్; కూర్పు: నవీన్ నూలి.