09-10-2025 05:30:36 PM
ఓటుతో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి
సమావేశంలో బండ నరేందర్ రెడ్డి చిరుమర్తి లింగయ్యలు
నకిరేకల్ (విజయక్రాంతి): కాంగ్రెస్ 22 నెలల పాలనలో అభివృద్ధి, హామీలు కాగితాలకే పరిమితమైందని, ఆచరణకు సాధ్యం కాని హామీలను ఆశ చూపి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ బాకీలను ప్రజలకు వివరించి బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు అన్నారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో గురువారం బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ మరచిన హామీలను కాంగ్రెస్ బాకీ కార్డుతో ప్రజలకు గుర్తు చేస్తున్నా మన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం పడరానిపాట్లు, తినరానిగడ్డి తిన్నారన్నారు.
అమలుకానీ హామీలతో, మోసపూరిత మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. దేశంలో అన్నివర్గాల వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 4 వేల పెన్షన్ ఇస్తామని వృద్దులను, 6 వేలు ఇస్తామని దివ్యాంగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. మహిళలను, విద్యార్థినులను, నిరుద్యోగులను, ఆటోకార్మికులను, రైతు కూలీలను మోసం చేసిన దుర్మార్గులు కాంగ్రెస్ నాయకులు అని అన్నారు. 22 నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం రావడం లేదన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతో గ్రామాల్లో ప్రజలు దుమ్మెతి పోస్తున్నారన్నారు. ఎన్నికలు ఏవైనా, ఎప్పుడైనా గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడానికి తెలంగాణ ప్రజానీకం కంకణబద్దులై ఉన్నా రన్నారు. గులాబీ కండువాను చూస్తే పండు ముసలి వాళ్ళ నుండి చిన్న పిల్లలు వరకు సైతం ఎగిరి గంతేస్తున్నారన్నారు. ఫ్రీ బస్సు వలన పడే పాట్లను స్వయంగా మహిళలే విమర్శిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసేదాకా బిఆర్ఎస్ పార్టీ తరుపున కొట్లాడుతూనే ఉంటామన్నారు. 22 నెలల నుండి మాయమాటలతో, డైవర్షన్ పాలిటిక్స్ తో కాంగ్రెస్ నాయకులు పబ్బం గడుపుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనీ ప్రజలు కసితో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను చీపురులతో ఉరికించే రోజులు దగ్గరలోనే ఉన్నారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేసిన కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి చేరేవేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలన్నారు.ఈ సమావేశంలో మాజీ జెడ్పిటిసి తరాల బలరాం, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సంధినేని వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు కొప్పుల ప్రదీప్ రెడ్డి, రాములు, శ్రీనివాస్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, ఐలయ్య, మల్లేశం, కరుణాకర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు