calender_icon.png 4 July, 2025 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

65 సినిమాలు పైరసీ

04-07-2025 12:11:01 AM

  1. ఏపీకి చెందిన జన కిరణ్‌కుమార్ అరెస్ట్  
  2. సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (విజయక్రాంతి): టాలీవుడ్‌ను పట్టి పీడిస్తున్న పైరసీ భూతానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్రేక్ వేశారు. సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం చేకూర్చిన భారీ పైరసీ రాకెట్‌ను ఛేదించి, దాని కీలక సూత్రధారి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్‌కుమార్‌ను గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీ ఎత్తున పైరసీ చేసిన సినిమా ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పైరసీ దెబ్బకు టాలీవుడ్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2024లో సినిమా పరిశ్రమ పైరసీ వల్ల రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లిందని తమ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో నిందితుడు కిరణ్ కుమార్ తన నేరాన్ని అంగీకరించాడు.

సినిమా థియేటర్లలోనే ‘కామ్‌కార్డు’ ద్వారా చిత్రాలను హెడీ ప్రింట్లుగా రికార్డు చేసి, విడుదలైన రోజే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్టు వెల్లడించాడు. హైదరాబాద్‌లోని సినిమా థియేటర్లలోనే ఈ రికార్డింగులు చేసినట్టు సైబర్ పోలీసులు గుర్తించారు. పైరసీ చేసిన చిత్రాలను మాఫియాకు విక్రయించేవాడని, ‘వన్ తమిళ్ ఎమ్‌వీ’తో పాటు ‘వన్ తమిళ్ బ్లస్టర్’, ‘5మువీరుల్జ్’ వంటి ప్రముఖ పైరసీ వెబ్‌సైట్లకు కూడా వీటిని అమ్ముతున్నాడని కిరణ్ కుమార్ తెలిపాడు.

పైరసీ సినిమాలకు బదులుగా ఒక్కో సినిమాకి 400 క్రిప్టో కరెన్సీని లేదా బిట్‌కాయిన్స్ రూపంలో నగదును తీసుకున్నట్టు నిందితుడు వివరించాడు. బిట్‌కాయిన్స్, క్రిప్టో రూపంలో వచ్చిన నగదును ‘జూ పే’ ద్వారా భారతీయ కరెన్సీకి మార్చుకున్నట్టు పోలీసులు గుర్తించారు. గత ఏడాదిన్నర కాలంలో దాదాపు 40 పెద్ద సినిమాలు సహా మొత్తం 65 తెలుగు, తమిళ చిత్రాలను పైరసీ చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు.

ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాద్, గేమ్ చేంజర్, రాజధాని వంటి చిత్రాల ఫైల్స్‌తో పాటు తండేల్, సింగిల్, కిస్మత్ (హిందీ), రొమాంటిక్, గేమ్‌ఆన్, ప్రతిరోజు పండగే వంటి సినిమాల పైరసీ ఫైల్స్‌ను కిరణ్ కుమార్ నుంచి సైబర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై 1957 కాపీరైట్ చట్టం, ఐటీచట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని రిమాండ్‌కు తరలించారు.