08-10-2025 05:25:49 PM
మంత్రి పొన్నంపై ఎమ్మార్పీఎస్ నాయకుల ఆగ్రహం..
ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొమ్మెట రాజు ఆధ్వర్యంలో నాయకులతో కలిసి రాష్ట్ర మంత్రి పొన్నంపై నిరసన చేపట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాదిగల ఆత్మగౌరాన్ని దెబ్బతీసే విధంగా సహచర మంత్రి అని కూడా కనీస అజ్ఞానంతో ఆవేశంగా ఊగిపోతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై చేసిన అనుచిత వాఖ్యలను ఖండించారు. ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మంత్రి పొన్నం ప్రభాకర్ తన తోటి మంత్రి అని కూడా చూడకుండా అగౌరవ పదజాలం వాడుతూ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై చేసిన అనుచిత వాఖ్యలు చేయడం సరికాదన్నారు.
యావత్ మాదిగ జాతిని కించపరిచేలా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పొన్నం దిష్టిబొమ్మను దహనం చేసి తన కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. మాదిగలకు డబ్బులు, పదవుల కన్నా ఆత్మగౌరవమే ముఖ్యమని పేర్కొన్నారు. అహంకారం వలన అనార్ధాలే తప్ప మంచి జరగదని హితవు పలికారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే పొన్నం ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుంచు మల్లేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.