calender_icon.png 25 November, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజనీరింగ్ ఖర్చులే.. ప్రధాన ఎజెండా

25-11-2025 07:58:27 PM

అభివృద్ధి పనులపై చర్చ శూన్యమేనా..?

అచ్చంపేట: పట్టణంలో ప్రాధాన్యతక్రమంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని అచ్చంపేట పురపాలిక ఛైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు తెలిపారు. ఎజెండాలోని అంశాలపై ప్రధాన చర్చ చేశామని.. అందులో ప్రస్తావించిన మాధిరే పనులు చేపడుతామని చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలిక సర్వసభ్య సమావేశాన్ని ఛైర్మన్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. కౌన్సిలర్ల కోసం కేటాయించిన ప్రత్యేక గదిలో వివిధ వార్డుల కౌన్సిలర్లు, పుర అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ముక్తసరి అంశాలనే ఛైర్మన్ తన వద్దకు వచ్చిన విలేఖరులతో చెప్పారు. ప్రధానంగా ఎజెండాలోని అంశాలపై చర్చించి.. దానికి అనుగుణంగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

* ఖర్చుల వివరాలే..

పట్టణంలోని వివిధ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా.. భవిష్యత్తులో పట్టణంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి చర్చించాల్సిన అచ్చంపేట పురపాలిక సర్వసభ్య సమావేశంలో చర్చించిన వివరాలేవీ భహిర్గతం కావడం లేదు. గతంలో ముందస్తు నోటీసుతో ఎజెండా వివరాలు వెల్లడించి.. మీడియా సమక్షంలో సమావేశాలు నిర్వహించేవారు. కానీ గత కొద్ది నెలలుగా వివరాలు తెలియజేయకుండా గోప్యతతో సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన సమావేశం సైతం అదేవిధంగా కొనసాగింది. సర్వసభ్య సమావేశానికి సంబంధించి 26 అంశాలతో ఎజెండా తయారు చేశారు. అందులో ఇంజనీరింగ్ విభాగంలో చేసిన ఖర్చు, వాటి ఆమోదం కోసం అనుమతి కోరుతూ ఉన్నా.. అంశాలనే చేర్చారు. ఎక్కడా భవిష్యత్తులో పట్టణ ప్రగతిలో చేపట్టబోయే అంశాలను వివరించలేదు. ఒక్క తడిపొడి చెత్త సేకరణకు అవసరమయ్యే ప్రాసెసింగ్ యూనిట్ మంజూరు గురించి తెలియజేశారు.

* ఎందుకంతా రహస్యం

గతంలో నిర్వహించిన ప్రతీ సమావేశంలోనూ మీడియాకు అనుమతి ఉండేది.. కానీ కొద్ది నెలలుగా మీడియాకు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. పైగా సమావేశం అనంతరం ఏమేమీ అంశాలు చర్చించారు. ప్రజలముందుంచాల్సిన అంశాలను వివరించాల్సిన అధికార యంత్రాంగం స్పందించడం లేదు. నిజంగా సర్వసభ్య సమావేశానికి మీడియాకు అనుమతి లేకుంటే.. అందులో చర్చించిన వివరాలను సమావేశం అనంతరం కమిషనర్ లేదా ఛైర్మన్ వెల్లడిస్తారు. కానీ అచ్చంపేట పురపాలికలో మాత్రం శత్రుదేశానికి సంబంధించిన అంశాలను చర్చించి.. వాటిని బహిర్గతం చేయొద్దనేలా ఉన్న ఉద్దేశ్యమేమిటో మున్సిపల్ కమిషనర్ కే తెలియాలి. సర్వసభ్య సమావేశంలో కమిషనర్ మురళి, మేనేజర్ రమేశ్ నాయక్, ఏఈ రాజునాయక్, టీపీవో మనోజ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.