05-10-2025 12:15:17 AM
-మా ఇంట్లో మటన్ తినని నీవ్వు... మీ ఇంట్లో చికెన్ ఎలా తింటున్నావు?
-భార్యను ప్రశ్నించిన భర్త
-ఇద్దరి మధ్య వాగ్వాదం
-అత్తారింటికి వెళ్లి భార్య ఆత్మహత్య
-గత నెల 26న ప్రేమ పెళ్లి చేసుకున్న జంట
-జగిత్యాల జిల్లా ఎర్దండి గ్రామంలో ఘటన
కోరుట్ల, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): గత నెల 26న పెద్దలను ఒప్పించి, ప్రేమ పెళ్లి చేసుకున్న జంట మధ్య మటన్ తినే విషయమై జరిగిన గొడవ.. భర్త ఆత్మహత్యకు కారణమైంది. తమ ఇంట్లో మటన్ తినని భార్య.. ఆమె తల్లిగారింట్లో చికెన్ తినడం చూసిన భర్త.. ఎందుకు తింటున్నావని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత తన భార్యను తీసుకుని ఇంటికి వెళ్లాడు. తన తల్లిగారింట్లో జరిగిన గొడవకు మనస్థాపానికి గురైన భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో శుక్రవా రం మధ్యాహ్నం జరగగా.. శనివారం వెలుగులోకి వచ్చింది. ఎర్దండి గ్రామానికి చెందిన సంతోష్, గాయత్రి(23) ఎదురెదురు ఇళ్లలో ఉండేవారు. ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరు.. పెద్దలను ఒప్పించి గత నెల 26న పెళ్లి చేసుకున్నారు. దసరా రోజు దంపతులిద్దరూ గాయత్రి తల్లి గారిఇంటికి వెళ్లి భోజనాలు చేస్తున్నారు.
ఆ సమయంలో చికెన్ తింటున్న భార్య గాయత్రిని చూసిన సంతోష్.. “మన ఇంట్లో మటన్ తెస్తే తినని నీవు.. మీ ఇంట్లో చికెన్ ఎలా తింటున్నావు” అని ప్రశ్నించడం ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. గాయత్రికి మటన్ ఇష్టం ఉండదని, చికెన్ మాత్ర మే తింటుందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. గొడవ తర్వాత గాయత్రిని తీసుకుని సంతోష్ తన ఇంటికి వెళ్లాడు.
అయితే తల్లిగారింట్లో జరిగిన గొడవకు గొడవకు మనస్థాపానికి గురైన గాయత్రి.. అత్తగారింటికి వెళ్లిన తర్వాత ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తినేటప్పుడు జరిగిన గొడవను మనసులో పెట్టుకొని ఇంటికి బలవంతంగా తీసుకెళ్లి తన కూతుర్ని ఇబ్బంది పెట్టడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని గాయత్రి తల్లి శారద ఆరోపించింది.