29-11-2025 12:46:41 AM
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ2’. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తుండగా, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శుక్రవారం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ వేడుకలో బాలకృష్ణ తన రాబోయే సినిమాలోని ‘చరిత్రలో చాలామంది ఉంటారు. చరిత్రను తిరిగి సృష్టించేవాడు ఒకడే ఉంటాడు. నేనే చరిత్ర.. నాదే ఆ చరిత్ర’ అనే డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “సినిమాకు ఎలాంటి తారతమ్యాలు లేవు. నన్ను అర్థం చేసుకునేవారితో కలిసి పనిచేయడం నా అదృష్టం. నేనెప్పుడూ అభిమానుల గురించే ఆలోచిస్తుంటా. నా కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేశా. ‘అఖండ2’ మరో స్థాయిలో ఉంటుంది.
నేను, బోయపాటి శ్రీను సినిమా చేయాలనుకుంటే దాని గురించి మూడు నిమిషాల పాటు మాట్లాడు కుంటామంతే.. రంగంలోకి దిగిపోతాం. నటన అంటే మరో ఆత్మలోకి ప్రవేశించడం.. నేను పాదరసం లాంటి వాడిని. ఎందులోకి వెళ్తే ఆకారం సంతరించుకుంటాను. ఏ ఛాలెంజ్‌కైనా నేను సిద్ధం. ఒకే పనితో నేను సంతృప్తి చెందను. అందుకే నటుడిగానే కాకుండా రాజకీయాల్లో, వ్యాపారాల్లో ఉన్నా. బాలకృష్ణ సినిమా అంటే ఉగాది పచ్చడిలాంటిది. అందులో అన్ని రసాలూ ఉండాలి.
ఆకృత్యాలు మీరితే మనిషే ఆ దైవాన్ని తనలో ఆవహించుకుంటాడనేదే ఈ సినిమా. ఇందులో గెటప్ వేసుకోవడానికి రెండు గంటలు, తీయడానికి గంట పట్టేది. ఈ సినిమాను జార్జియాలో చాలా చలి ప్రదేశాల్లో షూట్ చేశాం. ఈ సినిమాకు హిందీలో డబ్బింగ్ నేనే చెప్పాను” అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. “బాలయ్య మా ఆస్తి.. ఆయనే మా శక్తి.. ఆయనే మా ధైర్యం. సెన్సార్ ఇప్పడే పూర్తయింది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా తర్వాత మీరు గౌరవమైన స్థానంలో ఉంటారని సెన్సార్ సభ్యులు చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది.
నేను ఎమోషన్‌ను, అందులోనుంచి వచ్చే యాక్షన్‌ను నమ్ముతాను. ఈ సినిమాలో మా చిన్నబ్బాయి ఒక క్యారెక్టర్ చేశాడు.. ఆయనకు ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి. ‘అఖండ’ ప్రజల్లోకి బాగా చొచ్చుకెళ్లింది. ‘తాండవం’ చేస్తే నిజంగా పరమేశ్వరుడే కనిపించాలి అనుకుని ఈ సినిమా ప్రారంభించాం. జన్మభూమి కోసం యుద్ధం చేసే సైనికులు అన్నిచోట్ల ఉంటారు. కానీ కర్మభూమి కోసం యుద్ధం చేసే వీరులు భారతదేశంలోనే ఉంటారు. అందుకే ఈ దేశం ముందుకు వెళుతుంది” అన్నారు.
సంయుక్త మాట్లాడుతూ.. “అఖండ నాకు ఎంతో ఇష్టమైన సినిమా. అఖండ2 నేను భాగమవుతానని ఎప్పుడూ అనుకోలేదు. బాలయ్యతో పనిచేయడం అద్భుతమైన అనుభూతి. ఎంతో ఆనందంగా కలిసి పనిచేశాం. జాజికాయ సాంగ్ అందరూ స్క్రీన్ మీద చాలా ఎంజాయ్ చేస్తారు” అని చెప్పింది. నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ.. “సినిమాను భుజాల మీద మోసుకెళ్లేది అభిమానులే. సినిమాకి ఆక్సిజన్ లాంటివాళ్లు వాళ్లే. కెమెరా ముందు బాలయ్య తాండవం.
కెమెరా వెనకాల డైరెక్టర్ బోయపాటి తాండవం డిసెంబర్ 5న థియేటర్లో ప్రేక్షకుల తాం డవం.. ఇది పక్కా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త గంగాధరశాస్త్రి, నటీ నటులు మురళీమోహన్, ఆది పినిశెట్టి, హర్షాలి, పూర్ణ, కబీర్, సంగీత దర్శకుడు తమన్, గీత రచయితలు కాసర్ల శ్యామ్, కళ్యాణ్ చక్రవర్తి, ఫైట్ మాస్టర్లు రామ్ మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.