22-12-2025 02:20:18 AM
స్టార్ హీరో యష్ నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. 2026 మార్చి 19న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ కియారా అద్వానీ ‘నాదియా’ పాత్రలో నటిస్తోంది. ఈ మేరకు ఆమె ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. కియారా.. ఇప్పటివరకు ఎమోషనల్, హై వోల్టేజ్ కమర్షియల్ వంటి వైవిధ్యమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఈ సినిమాలో కియారా పోషిస్తున్న పాత్ర ఆమె ఫిల్మోగ్రఫీ స్థాయిని మరింత పెంచేలా సరికొత్తగా ఉంది. నాదియాగా కియారా ఫస్ట్‌లుక్ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్‌ను గమనిస్తే.. కియారా పాత్రలో లోతైన భావోద్వేగాలు కనిపిస్తున్నాయి.
డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ “కొన్ని పాత్రల్లో నటించినప్పుడు అవి సినిమాకే పరిమితం కావు. యాక్టర్‌కు సరికొత్త గుర్తింపును తీసుకొస్తాయి. నాదియా పాత్రలో కియారా చేసిన నటన డిఫరెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కనిపిస్తుంది. ఆమె పెర్ఫామెన్స్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా” అని పేర్కొన్నారు. యష్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతోపాటు మరికొన్ని భాషల్లో అనువాదం చేయనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలను రాజీవ్ రవి నిర్వహిస్తుండగా.. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్ టీపీ అబీద్ చేస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ (జాన్ విక్ ఫేమ్)తోపాటు అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు.