22-12-2025 02:18:15 AM
యువ నటుడు రోషన్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘గిర గిర’, ‘సల్లంగుడాలే’ పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచి అంచనాలను పెంచాయి. తాజాగా మేకర్స్ మూడో పాట ‘ఐ యామ్ ఎ ఛాంపియన్’ను లాంచ్ చేశారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఈ మూడవ సాంగ్ ఒక పక్కా డ్యాన్స్ నంబర్‌గా అలరిస్తోంది.
భారీ సెట్టింగ్‌లు, మంచి డ్యాన్స్ కంపోజింగ్‌తో శ్రోతలను వెంటనే కట్టిపడేస్తున్నది. జయరాం, రమ్య బెహరా తమ గాత్రాలతో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. పాటలో రోషన్ డ్యాన్స్ ప్రదర్శన హైలైట్‌గా నిలువనుంది. జాజ్ బీట్స్‌కు అనుగుణంగా రోషన్ వేసిన స్టెప్పులు, అతని బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పోనీ వర్మ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచి, స్టులిష్ హుక్ స్టెప్స్‌తో విజువల్స్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రలు పోషిస్తున్నారు. తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆర్.మదీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం టెక్నికల్‌గా చాలా రిచ్‌గా ఉండబోతోందని స్పష్టమవుతోంది. రోషన్ డ్యాన్సింగ్ స్కిల్స్‌ను మరోసారి నిరూపించేలా ఉన్న ‘ఐ యామ్ ఎ ఛాంపియన్’ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.