03-05-2024 12:42:10 AM
140 మిలియన్ మైళ్ల దూరం నుంచి పంపిన సైకే
వాషింగ్టన్, మే 2: అత్యంత సుదూర విశ్వాంతరాళం నుంచి భూమికి రేడియో కమ్యూనికేషన్ సిగ్నల్‌ను పంపి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా రికార్డు సృష్టించింది. భూమికి 140 మిలియన్ మైళ్ల దూరం నుంచి నాసాకు చెందిన సైకే వ్యోమనౌక దీనిని పంపింది. అంగారకుడు, గురు గ్రహం మధ్య ఉన్న ఆస్టరాయిడ్ బెల్ట్‌లోని సైకే 16 అనే ఉల్కను అధ్యయనం చేసేందుకు అదే పేరుతో నాసా గతేడాది అక్టోబర్ 23న ఓ వ్యోమనౌకను పంపింది. సైకే 16పై పరిశోధనలతోపాటు విశ్వంలోని సమాచార సందేశాలను పసిగట్టడం కూడా దీని పని. ఇందులో డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్‌ను అమర్చారు. దీని ద్వారానే విశ్వంలో ప్రయాణించే తరంగాలను గుర్తిస్తుంది. భూమికి సూర్యుడితో పోల్చితే 1.5 రెట్ల దూరం నుంచి సైకే రేడియో సిగ్నల్‌ను భూమికి విజయవంతంగా పంపిందని నాసా జెట్ ప్రొపల్షన్ ఆపరేషన్స్ హెడ్ మీరా శ్రీనివాసన్ తెలిపారు.