03-11-2025 02:54:09 AM
ఎల్బీనగర్, నవంబర్ 2: ప్రకృతి వైద్యాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు, ఖమ్మం సిద్ధార్థ యోగా విద్యాలయ ఫౌండర్ డాక్టర్ రామచంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం మన్సూరాబాద్ డివిజన్ లోని ఎంఈరెడ్డి ఫంక్షన్ హాల్లో సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ‘ప్రకృతి ఆరోగ్య చైతన్య మహోత్సవం%--%2025’ నిర్వహించారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ నేచురోపతి డైరెక్టర్ సత్య లక్ష్మితో కలిసి డాక్టర్ రామచంద్ర మాట్లాడారు.
సిద్ధార్థ యోగ ఆరోగ్యాలయం ఆధ్వర్యంలో ‘మన ఆరోగ్యం కోసం మనమే నిలవాలి’ అనే సారాంశాన్ని హైదరాబాద్ నగరంలో ఉన్న కోటి యాభై లక్షల కుటుంబాలను చైతన్యం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ‘ఇల్లే వైద్యశాల, వంట గదే మందుల షాపు, అమ్మే డాక్టర్’ అంటూ ప్రకృతి వైద్యం గొప్పతనాన్ని వివరించారు. షుగర్, క్యాన్సర్ లాంటి మొదలైన వ్యాధులకు ప్రకృతి వైద్యం శాశ్వత పరిష్కారం చూపుతుందని తెలిపారు.
మునగాకు, కరివేపాకు, కొత్తిమీర, కొండపిండి ఆకు, రణపాల జ్యూస్‌లు తీసుకుంటే సర్వరోగాలను నివారిస్తాయని వివరించారు. జనవరి 2026 నుంచి జనవరి 2027 వరకు ఏడాది పాటు సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లోకి ప్రకృతి వైద్యాన్ని తీసుకెళ్తామన్నారు. ఆరోగ్య అభిలాషులు ఇందలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి డైరెక్టర్ సత్య లక్ష్మి మాట్లాడుతూ... ప్రజలందరూ ప్రకృతి వైద్యంపై శ్రద్ధ చూపించి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాలన్నారు.
మహాత్మాగాంధీ స్ఫూర్తితో ప్రకృతి వైద్యం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిద్దార్థ యోగా సహ స్థాపకురాలు డాక్టర్ పద్మ, ప్రముఖ ప్రకృతి వ్యవసాయదారుడు, రైతు డాక్టర్ విజయరాం, గాంధీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఎండీ రాజేందర్, శాంసుందర్, కేడీ అప్పారావు, ఇంద్రాణి, ప్రసాద్ తదితర ప్రముఖులు, డాక్టర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రకృతి ప్రేమికులు, ఆరోగ్యాభిలాషులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.