calender_icon.png 28 November, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం

27-11-2025 12:00:00 AM

-అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో లాంఛనంగా ప్రక్రియ

-ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

-అభినందనలతో ముంచెత్తిన కార్యకర్తలు, పార్టీ నేతలు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి):జూబ్లీహిల్స్ నియోజకవర్గ నూతన శాసనసభ్యుడిగా కాంగ్రెస్ నేత వి. నవీన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి భారీ మెజారిటీతో విజయం సాధించిన ఆయన అసెంబ్లీ వేదికగా తన బాధ్యతలను స్వీకరించారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ ఈ కార్యక్రమానికి వేదికైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో నవీన్ యాదవ్ దైవసాక్షిగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.

ప్రమాణ స్వీకారం అనంతరం నిబంధనల ప్రకారం రిజిస్టర్‌లో సంతకం చేశారు.  తనకు ఈ అవకాశం కల్పించినందుకు, సజావుగా ప్రమాణ స్వీకారం జరిపించినందుకు స్పీకర్‌కు నవీన్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య కాంగ్రెస్ నేతలు, నవీన్ యాదవ్ అనుచరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్ రాకతో అసెంబ్లీ ఆవరణలో కోలాహలం నెలకొంది.