09-10-2025 12:00:00 AM
రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు యధాతథం
నార్సింగి/చేగుంట అక్టోబర్ 8 :స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్న రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ను జారీ చేసిన ఎన్నికల కమిషన్ అనంతరం ఎన్నికల కోడ్ ను అమలు పరచాలని జీవో జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు కూడా ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర మంతటా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా నార్సింగి గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టి లో మాత్రం కోడ్ ఇంకా అమలు కానట్టు కనబడుతోంది.
కోడ్ అమలులోకి వచ్చి 11 రోజులు గడుస్తున్నా నిబంధనల ప్రకారం 24 గంటల్లో తొలగించాల్సిన రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు మాత్రం పట్టణ కేంద్రంలో దర్జాగా దర్శనమిస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఏ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు ఉండకూడదన్నది కోడ్ ఉద్దేశ్యం కాగా, కోడ్ అమలులోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా నార్సింగి ఈఓ తీరు పట్ల పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోడ్ అమలులో భాగంగా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం పాటిస్తున్న ఈఓపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.