విధుల పట్ల నిర్లక్ష్యం తగదు
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్, జూలై 2 (విజయక్రాంతి): విధుల పట్ల నిర్లక్ష్యం తగదని, ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నిబద్ధతతో పనిచేసి సేవలందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ఆదేశించారు. గురువారం జిల్లాలోని గార్ల మండలం కె.జి.బి.వి, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని, తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కేజీబీవీలో తరగతి గదులను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి వారి చదువు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వంటశాల, భోజనశాల, వసతి గృహాలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాన్ని స్వయంగా పరిశీలించారు. గార్ల మండల కె.జి.బి.వి ప్రత్యేక అధికారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు తరగతి వసతుల కోసం నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ పాఠాలు చదివి వినపించమన్నారు. వాటి యొక్క అర్థాలను తెలుయకపోతే అట్టి అంశాలపై కలెక్టర్ స్వయంగా వివరించారు.
విద్యార్థుల ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పరిశీలించారు. బాలికల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకూడదని, వారికి సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం మన బాధ్యత అని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి సిబ్బంది విధుల నిర్వహణ పై, పెండింగ్ ఫైళ్ల వివరాల నివేదికలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో డి.ఈ.ఓ సత్యనారాయణ, ఎం ఈ ఓ వీరభద్రరావు, స్పెషల్ ఆఫీసర్ గాయత్రి, వార్డెన్, ఎం.ఆర్.ఓ శారద, ఎం.పి డి.ఓ, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బాలు నాయక్ డాక్టర్ సతీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






