19-11-2025 10:14:09 PM
కల్హేర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం(Drugs) మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై బుధవారం ఎస్సై రవి గౌడ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడారు. గుడుంబా, బెల్లం, గంజాయి, డ్రగ్స్ వినియోగించడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే బాల్య వివాహాలు, ఫోక్సో చట్టం, బెట్టింగ్, జూదం వంటి చేడు వేసనాలకు బానిసకావద్దని, సోషల్ మీడియా మాధ్యమాలు వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ వంటి వాటిలో అపరిచిత వ్యక్తులతో మాట్లాడకూడదు, చాటింగ్ చేయరాదని, తమ యొక్క విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్సై రవి గౌడ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు, మండల వైద్యాధికారి, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.