calender_icon.png 9 May, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరికొత్త ప్రయోగం సక్సెస్!

09-05-2025 01:46:39 AM

వేసవి శిబిరాలతో పిల్లలకు ఆటవిడుపు ఆనందం, ఆహ్లాదం నైపుణ్యాభివృద్ధి ప్రభుత్వ పాఠశాలపై ప్రైవేటు విద్యార్థుల ఆసక్తి

మహబూబాబాద్, మే 8 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఈ ఏడాది వినూత్నంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టిన ప్రయోగాత్మక విధానం సక్సెస్ గా సాగుతోంది. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలు బడి ఈడు పిల్లలకు ఆటవిడుపుగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేటు భేదం లేకుండా ఐదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక వేసవి శిబిరాలను ఈనెల 6 నుండి 20 వరకు పక్షం రోజులపాటు నిర్వహిస్తోంది.

పక్షం రోజులపాటు నిర్వహించే శిక్షణ శిబిరాలకు 50 వేల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 50 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక వేసవి శిబిరాల్లో కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు ఉన్న పాఠశాలలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ (ఏఐ ) ద్వారా విషయ పరిజ్ఞానం పెంపొందించడంతోపాటు సామాజిక అంశాలపై అవగాహన, స్ఫూర్తి దాయకమైన అంశాలపై డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు.

ఒక్కో కేంద్రంలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించే విధంగా శిక్షణ ఇచ్చేందుకు గౌరవ వేతనంతో  నలుగురు ట్యూటర్లను నియమించారు. అలాగే వివిధ రకాల ఇండోర్ గేమ్స్ చెస్, చిత్రలేఖనం, క్రాఫ్ట్ సబ్జెక్టుల వారిగా ట్యూటర్లు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే ఆంగ్ల భాష పై పట్టు సాధించేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహిస్తున్నారు.

ఉదయం శిబిరానికి హాజరైన విద్యార్థులచే యోగ, వ్యాయామం చేయించిన తర్వాత పూర్తిగా నీడ పట్టున వివిధ అంశాలపై శిక్షణ, అవగాహన, నైపుణ్యాభివృద్ధి, విషయ పరిజ్ఞానం, క్రీడల్లో ప్రావీణ్యం పొందెలా శిక్షణ ఇస్తున్నారు. రెండున్నర గంటల పాటు నిర్వహించే ప్రత్యేక సమ్మర్ క్యాంపులో ప్రతిరోజు విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్నారు. 

జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాలతో ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట పెంపొందించడం, వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంపొందించడానికి, డ్రాపౌట్ల సంఖ్య తగ్గించడానికి తప్పకుండా దోహదపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

క్రీడల పట్ల పెరుగుతున్న ఆసక్తి

విద్యాశాఖ తరహాలోనే రాష్ట్ర యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 10 చోట్ల ప్రత్యేక వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేసింది. ఈనెల ఒకటి నుండి జూన్ 6 వరకు నిర్వహించే వేసవి క్రీడా శిక్షణా శిబిరాల్లో ఉదయం 6 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రత్యేకంగా క్రీడల్లో నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాలకు ఆట వస్తువులు, సామాగ్రి సమకూర్చారు.

అలాగే ఒక్కో శిబిరం నిర్వహణకు ప్రత్యేకంగా కోచ్ ను నియమించి నెల రోజులపాటు 5 వేల రూపాయల గౌరవ భృతి అందిస్తున్నారు. జిల్లాలోని పెద్ద వంగరలో అథ్లెటిక్స్, నరసింహుల పేట మండలం జయపురం, ఇనుగుర్తిలో వాలీబాల్, కేసముద్రం మండలం కలువల లో నెట్ బాల్, బేస్ బాల్,

మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో ఖో - ఖో, కురవి మండలం నేరడ, తొర్రూరు మండలం మాటేడులో కబడ్డీ, గార్లలో బాస్కెట్ బాల్ , మరిపెడ మండలం ఎల్లంపేటలో సాఫ్ట్ బాల్ క్రీడల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఒక్కో శిబిరంలో 100 నుంచి 225 మంది వరకు క్రీడల్లో శిక్షణ పొందే విధంగా కార్యాచరణ రూపొందించారు.

ప్రభుత్వ బడి భలే బాగుంది

నేను ఇప్పటివరకు ప్రైవేటు స్కూల్లో చదువుతున్నా. ఎండాకాలం సెలవుల్లో మా ఊరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలందరికీ వేసవి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారని చెబితే నాలుగు రోజుల నుండి వెళ్తున్నా. ఇక్కడ ఆటలు, పాటలు, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్ నేర్పుతున్నారు. అలాగే స్నాక్స్ ఇస్తూ చాలా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నేను చదివే బడికంటే ప్రభుత్వ బడి భలే బాగుంది. నన్ను వచ్చే సంవత్సరం ప్రభుత్వ బడిలో చేర్పించాలని మా తల్లిదండ్రులను కోరతాను.

 శ్రీకర్, విద్యార్థి, కలువల