13-05-2025 04:39:43 PM
నానో ఎరువులు లింకు పెట్టి ఇస్తున్నారని లొల్లి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): రాయితీపై ప్రభుత్వం అందిస్తున్న ఎరువులు పక్కదారి పట్టకుండా రైతులకు విక్రయించేలా వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన పాత పిఓఎస్ యంత్రాల(POS machines) స్థానంలో కొత్తవి పంపిణీ చేస్తున్నారు. ఇఫ్కో, ఎన్ ఎఫ్ సి ఎరువుల కంపెనీలు ఎరువుల డీలర్లకు పాత డివైజ్ కు బదులు కొత్త డిజిటల్ డివైజ్ అందజేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 600 పైగా ఎరువుల డీలర్లకు పాత పిఓఎస్ యంత్రాల స్థానంలో కొత్త డిజిటల్ డివైజ్ లను పంపిణీ చేస్తున్నారు. గతంలో వేలితో నొక్కే బటన్ లు ఉన్న డివైస్లకు బదులు కొత్తగా పంపిణీ చేసే డివైస్ లో పూర్తిగా టచ్ స్క్రీన్ ద్వారా లావాదేవీలు నిర్వహించే విధంగా ఆధునికత పరిజ్ఞానాన్ని జోడించారు.
ఎరువుల లింకుతో డివైజ్ ల పంపిణీ
కొత్తగా డిజిటల్ డివైస్లను అందజేస్తున్న ఎరువుల కంపెనీలు డీలర్లకు ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా, తమ సంస్థ ఉత్పత్తి చేసిన నాను డీఏపీ, యూరియా బాటిళ్ళను కొనుగోలు చేయాలని లింకు పెట్టి ఇస్తున్నట్లు జిల్లా పరిధిలోని మరిపెడలో సోమవారం డివైజ్ ల పంపిణీలో కొందరు డీలర్లు గొడవకు దిగారు. ఉచితంగా ఇవ్వాల్సిన డివైజ్ లకు 5 వేల రూపాయల విలువైన నానో యూరియా, డీఏపీ అంట కట్టడం సరికాదని వాదనకు దిగారు. దీనితో అధికారులు జోక్యం చేసుకొని ఉచితంగానే డీలర్లకు డివైజ్ లను అందజేశారు.
ఉచితంగానే పంపిణీ
ఎరువుల డీలర్లకు ఉచితంగానే పి ఓ ఎస్ డిజిటల్ యంత్రాలను అందిస్తున్నాం. నానో యూరియా డిఏపీ లింకు పెట్టి ఇస్తే తమ దృష్టికి తేవాలి. ఎవరు కూడా నూతన పిఓఎస్ యంత్రాల కోసం డబ్బులు ఇవ్వకూడదు. అధికారులకు, కంపెనీ ప్రతినిధులకు ఎక్కడ కూడా ఎలాంటి మ్యానుకులేషన్ లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చాం.
విజయ నిర్మల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మహబూబాబాద్