calender_icon.png 14 October, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

13-10-2025 10:00:32 PM

-నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం కృషి

-ఐటి, సేవా, నిర్మాణ, వాణిజ్య, ఫార్మారంగలకు చెందిన 150 కంపెనీలు హాజరు...

-3000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి 

-రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్ (విజయక్రాంతి): నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు.  సోమవారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ నెల 25న నిర్వహించే జాబ్ మేళా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... సమాజంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, యువత ఉన్నత చదువులు చదువుకొని ఎలాంటి ఉద్యోగం లభించక నిరుద్యోగంతో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 25న హుజూర్ నగర్ పట్టణంలోని పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జాబ్ మేళాకు ముఖ్య అతిధిగా హాజరుకానున్న రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు హాజరుకానున్నారని తెలిపారు.

సింగరేణి కంపెనీ,పరిశ్రమల శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో ఐటి, సేవా, నిర్మాణ, వాణిజ్య, ఫార్మారంగలకు చెందిన 150 కంపెనీలు హాజరుకానుండగా సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. 2018 నుండి పది, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏలలో ఉత్తీర్ణత సాధించిన వారు, అలాగే 2026లో ఉత్తీర్ణత సాధించబోయే వారికి ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హత ఉంటుందని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొవాలని కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, అలాగే స్థానికులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, నిరుద్యోగ యువతకు మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు మంత్రి ఉత్తమ్ సూచించారు.

అనంతరం డీట్ (డిఈఈటి - డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ) ప్రతినిధి వంశీ మాట్లాడుతూ జాబ్ మేళా పోస్టర్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా ఆవిష్కరించి క్యూ ఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. అభ్యర్థులకు ముందుగానే ఏ కంపెనీకి అర్హత ఉందో తెలిపే విధంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని, మూడు నుంచి ఐదు కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరయ్యేవిధంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అంతకు ముందు పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్ నేషనల్ స్కూల్ ను అధికారులతో కలిసి మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. ఈ సమావేశంలో ఆర్డిఓ శ్రీనివాసులు, సింగరేణి కంపెనీ ప్రతినిధులు శ్రీకాంత్, చందర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి శంకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక అరుణ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు,అజీజ్ పాషా తదితరులు పాల్గొన్నారు.