31-12-2025 01:32:47 AM
కొత్త ఏడాది డీజేలతో హోరెత్తించేందుకు సన్నాహాలు
మేడ్చల్ జిల్లాలో వందల సంఖ్యలో ఫామ్‌హౌస్‌లు, రిసార్టులు
అనుమతులు లేకుండా ఏర్పాట్లు
మేడ్చల్, డిసెంబర్ 30(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఫామ్ హౌస్ లు, రిసార్టులు బుకింగ్ ఫుల్ అయ్యాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు చేసే సందడిని ఆసరాగా చేసుకుని ఈవెంట్ల నిర్వహకులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. రిసార్టులలో న్యూ ఇయర్ వేడుకలు మందుతోపాటు ఇతర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మేడ్చల్ జిల్లాలో వందల సంఖ్యలో ఫామ్ హౌస్, రిసార్టులు ఉన్నాయి. కొన్ని రిసార్టులలో పెద్ద ఎత్తున న్యూ ఇయర్ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ ఈవెంట్లు నిర్వహిస్తున్నామని ప్రకటించాయి. ఒక్కొక్కరికి రూ. 3000 నుంచి రూ. 15000 వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో లిక్కర్, ఫుడ్ తదితర ఏర్పాట్లు ఉన్నాయి.
అనుమతులు లేవు!
న్యూ ఇయర్ వేడుకలకు మందు వినియోగిస్తే ఎక్సైజ్ అనుమతులు తీసుకోవాలి. కానీ చాలా ఫామ్ హౌస్ లు, రిసార్టులు అనుమతులు తీసుకోలేదు. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. పోలీసు, ఎక్సైజ్ అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి వేడుకలు నిర్వహిస్తున్నారు. అంతేగాక చాలా రిసార్టులకు అనుమతులు లేవు. కొన్ని ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించారు.
ఫామ్‌హౌస్‌లలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి
ఫామ్‌హౌస్‌లో వందల సంఖ్యలో ఉండడంవల్ల ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మేడ్చల్ జిల్లాలోని శివారు ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఫామ్ హౌస్ లు ఉన్నాయి. ఇవి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. ఫామ్ హౌస్ లను నిర్మించి అద్దెకు ఇవ్వడం వ్యాపారంగా మారింది. రోజుకు ఫామ్ హౌస్ లో సౌకర్యాలను బట్టి అదే నిర్ణయించారు. ఫామ్ హౌస్లలో తనిఖీలకు ఎవరూ రారు. పట్టణంలోని లాడ్జిలలో తనిఖీలు జరుగుతాయనే భయంతో పాటు ప్రైవసీ ఉంటుందని ఉద్దేశంతో ఫామ్ అవుదులను అద్దెకు తీసుకొని అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు.
నిషేధం ఉన్న డీజే చప్పుళ్ళు
డీజే ఈవెంట్లకు అనుమతులు లేవు. వాటికి అనుమతులు ఇవ్వద్దని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది. నిర్వాహకులు డిస్క్ జాక్ మ్యూజిక్ పెడుతున్నారు. పోలీసులు యువకున్నప్పటికీ రిసార్ట్లలో డీజే ఏర్పాట్లు చేస్తున్నారు. ఫామ్ హౌస్ లో, రిసార్టులలో తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.