calender_icon.png 21 November, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిఖత్ గోల్డెన్ పంచ్

21-11-2025 12:00:00 AM

-వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్

-భారత బాక్సర్ల సరికొత్త చరిత్ర

-మహిళల విభాగంలో 7 స్వర్ణాలు

గ్రేటర్ నోయిడా, నవంబర్ 20 : వరల్డ్ బాక్సింగ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో ఏకంగా 9 స్వర్ణాలు కైవసం చేసుకుంది. సొంతగడ్డపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ అటు మహిళల విభాగంలో 7 బంగారు పతకాలు, ఇటు పురుషుల విభాగంలో 2 స్వర్ణాలు గెలుచుకుంది. ఊహించినట్టుగానే ఫైనల్స్‌లోనూ భారత మహిళా బాక్సర్లు దుమ్మురేపారు. ముఖ్యంగా ఏడాదిన్నరకు పైగా పతకం గెలవని తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శనతో రీఎంట్రీని ఘనంగా చాటుకుంది.

51 కేజీల విభాగంలో పోటీపడిన నిఖత్ ఫైనల్లో 5 స్కోర్‌తో చైనీస్ తైపీకి చెందిన జువాన్‌పై విజయం సాధించింది. ప్రత్యర్థి బాక్సర్‌పై పంచ్‌ల వర్షం కురిపిస్తూ మూడు రౌండ్లలోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచిన నిఖత్ స్వర్ణాన్ని సాధించింది. ఈ విజయం తర్వాత ఆమె ఎమోషనల్‌గా మాట్లాడింది. భుజం గాయంతో దాదాపు ఏడాదికి పైగా బాక్సింగ్ రింగ్‌కు దూరమై ఇప్పుడు సొంత అభిమానుల సమక్షంలో స్వర్ణం గెలవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది.

రీఎంట్రీలో ఇది ఆరంభం మాత్రమేనని, ఇకపై మరిన్ని విజయాలు సాధిస్తానని తెలిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బాక్సింగ్ అకాడమీ పెట్టబోతున్నట్టు వెల్లడించింది. దీనిపై సీఎం రేవంత్‌కు ప్రతిపాదన చెప్పానని, త్వరలోనే మరోసారి కలుస్తానని తెలిపింది. యువ బాక్సర్లకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చే విధంగా అకాడమీ ఉంటుందని పేర్కొంది. కాగా నిఖత్‌కు తెలంగాణ క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు. వరల్డ్ బాక్సింగ్ కప్‌లో స్వర్ణం గెలిచిన నిఖత్‌కు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ ట్రెజరర్ కె మహేశ్వర్ అభినందనలు తెలిపారు.

మరోవైపు ఈ చాంపియన్‌షిప్‌లో భారత మహి ళా బాక్సర్లకు ఎదురే లేకుండా పోయింది. 48 కేజీల విభాగంలో మీనాక్షి, 54 కేజీల విభాగంలో ప్రీతి, 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి, 80 కేజీల విభాగంలో నుపుర్, 57 కేజీల విభాగంలో జాస్మిన్, 60 కేజీల విభాగంలో పర్వీన్ స్వర్ణాలు సాధించారు. పురుషుల విభాగంలో సచిన్, హితేశ్ కూడా బంగారు పతకాలు గెలుచుకున్నారు.